Hrithik Roshan: ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'వార్ 2' ప్లాప్ అందుకే? హృతిక్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Hrithik Roshan: ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'వార్ 2' ప్లాప్ అందుకే? హృతిక్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం  'వార్ 2'.  ఈమూవీ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ లో భాగం కావడం.  ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.   స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.  మిశ్రమ స్పందనలతో నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.

 'చాలా సులభం' అనిపించింది కాని చివరికి..

'వార్ 2'  సినిమా డిజాస్టర్ పై లేటెస్ట్ గా హృతిక్ రోషన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  ఈ మూవీ షూటింగ్ సమయంలోని బిహైండ్‌ ది సీన్స్ ఫోటోలను పంచుకుంటూ హృతిక్ రోషన్ సుదీర్ఘమైన నోట్‌ను రాశారు. అందులో కబీర్‌గా నటించడం చాలా సరదాగా అనిపించింది. చాలా రిలాక్స్‌డ్. నాకు ఆ పాత్ర బాగా తెలుసు. ఇది సులభంగానే అవుతుందని అనుకున్నాను. చివరకు, మిగతా నటులు చేసేలా, నేను కూడా సరళంగా నా పని పూర్తి చేసి ఇంటికి వెళ్లగలిగే సినిమా దొరికింది అని పేర్కొన్నారు.

అలాగే, దర్శకుడు అయాన్ ముఖర్జీ నుంచి తనకు అద్భుతమైన సహకారం లభించిందని, అంతా పరిపూర్ణంగా అనిపించిందని తెలిపారు. ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, ఎటువంటి ఆందోళన అవసరం లేదు. నా పని సరిగ్గా చేస్తే చాలు అని నమ్మినట్లు హృతిక్ వెల్లడించారు. అయితే ఇదే సమయంలో తన మనసులో మెదిలిన ఒక అనుమానాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇది చాలా సులభంగా ఉంది... నాకు ఇది బాగా తెలుసు. అలాగే ప్రతి సినిమా చిత్రహింస, గాయం, నిరంతర అన్వేషణలా ఉండనవసరం లేదు. 

రిలాక్స్ అవ్వొచ్చు అనే మరో అంతర్గత స్వరాన్ని తాను పదేపదే అణచివేశానని హృతిక్ పేర్కొన్నారు.  ఈజీగా అనిపించిన ఈ పాత్ర తనను కమర్షియల్‌గా గట్టెక్కించలేదనే పరోక్ష సందేశాన్ని ఇచ్చారు. క్లిష్టమైన పాత్రల కోసం తాను పడే కష్టమే అసలైన విజయాన్ని ఇస్తుందని ఆయన భావించినట్లు ఈ పోస్ట్ ను చూస్తే అర్థం అవుతోందని నెటిజన్లు మరో వైపు కామెంట్లు చేస్తున్నారు.

 

భారీ బడ్జెట్... నిరాశపరిచిన వసూళ్లు

'వార్ 2' చిత్రాన్ని సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో యష్ రాజ్ స్టూడియోస్ నిర్మించింది సమాచారం. కానీ ఇండియాలో ఇది కేవలం రూ.235 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం రూ.360 నుంచి రూ - 370 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. లాభాలు రావాలంటే కనీసం రూ.700 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని అంచనా వేశారు. ఈ లెక్కన, భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చిందని స్పష్టమవుతోంది.

'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్', 'టైగర్ 3' తర్వాత YRF స్పై యూనివర్స్‌లో వచ్చిన ఆరో చిత్రమైన 'వార్ 2'కు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. హృతిక్, ఎన్టీఆర్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నా, కథనం, స్క్రీన్‌ప్లేలో ఉన్న లోపాలు, కొన్ని చోట్ల నాసిరకం వీఎఫ్‌ఎక్స్ వర్క్ సినిమాకు మైనస్‌గా నిలిచాయి. హృతిక్, ఎన్టీఆర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, ఈ చిత్రం ఆశించిన  స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. 

ఓటీటీలోకి 'వార్ 2'

థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయిన 'వార్ 2' ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. హృతిక్, ఎన్టీఆర్ అభిమానులు, అలాగే థియేటర్లలో మిస్సైన ప్రేక్షకులు ఓటీటీలో అయినా ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని వీక్షించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.