YCP శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన జగన్

YCP శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుదిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ లో ఇవాళ ఆ పార్టీ శాసన సభా పక్షం సమావేశం అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జగన్ పేరును ప్రతిపాదించగా…. మాజీమంత్రులు ధర్మన ప్రసాదరావు, పార్థసారథి , ఎమ్మెల్యే రోజా బలపరిచారు.

వైసీపీ తమ ఏకవాక్య తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు అందివ్వనుంది. హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ తో జగన్ ఇవాళ సమావేశం కానున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు జగన్ ను ఆహ్వానిస్తారు. మే 30న జగన్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు.

ఆ తర్వాత YCP ప్రజాప్రతినిధులు, నాయకులతో పార్టీ ఆఫీస్ మీటింగ్ లో జగన్ మాట్లాడారు.

విలువలు, విశ్వసనీయత ఆధారంగా.. వైసీపీకి జనం ఇచ్చిన తీర్పు ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం అన్నారు వైఎస్ జగన్. అన్యాయం చేస్తే దేవుడు కూడా క్షమించడు అన్న సంగతిని చంద్రబాబుకు తెలియజేశారన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంతమందిని తీసుకున్నారో.. అదే సంఖ్యలో 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే తెలుగుదేశానికి అందించారని అన్నారు.

2019లో గెలిచాం కాబట్టి… ఇంతకంటే గొప్ప టార్గెట్ తో 2024లో గెలిచే లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు జగన్. ఈ గెలుపు ఎవరికీ గర్వం తీసుకురావొద్దనీ.. అది మన భుజాలపై బాధ్యతను పెంచిందని పార్టీ నేతలతో జగన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కలిసి రావాలని జగన్ అన్నారు.