
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 21 న ప్రారంభించనున్న కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావోద్దని లేఖలో రాశారు. ఒకవేళ వస్తే కేసీఆర్ చేసిన తప్పులను మీరు కూడా ఒప్పుకున్నట్టు ఉంటుందని జగన్ ను ఉద్దేశించి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు నింపుతారో ప్రభుత్వం ఆ విషయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు పెట్టి కనీసం 15 శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. పూర్తి చేయకుండా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ నాయకులే అడ్డుకున్నారని భట్టి అన్నారు. ఇప్పుడు తామే అభివృద్ధికి అడ్డుపడుతున్నామంటూ సీఎం కేసీఆర్ అనడం సరికాదన్నారు. తాము అడ్డుకొని ఉంటే దేవాదుల, మిడ్ మానేరు ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చేవి కావన్నారు. ప్రాజెక్టులపై చర్చకు తాము సిద్ధమన్నారు. టెండర్ ల ప్రక్రియ జ్యుడీషియల్ కు ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు డీపీఆర్ ఇవ్వాలని భట్టీ కోరారు.