మహిళలను చిత్ర హింసలు పెడుతున్నరు

మహిళలను చిత్ర హింసలు పెడుతున్నరు

మంచిర్యాల: 2002 నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్నవారికి ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం కోయపోషగూడెంలోని గిరిజన పోడు రైతులతో ఆమె మాట్లాడారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు దారుణంగా కొట్టారంటూ బాధిత మహిళలు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల.. వైఎస్ఆర్ బతికుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని అన్నారు. భూములు తమవేనని 52 కుటుంబాలు ఏటా పోరాటం చేయాల్సి వస్తోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలని కూడా చూడకుండా వారిని జైలులో పెట్టి చిత్ర హింసలకు గురి చేశారని షర్మిల మండిపడ్డారు. పాలిచ్చే తల్లులని కూడా చూడకుండా పోలీసులు దారుణంగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్రంలో ఆడవారికి కనీస రక్షణ లేకుండా పోయిందని, పరిస్థితులు చూస్తే అసలు మనుషులుండే సమాజమేనా అన్న అనుమానం కలుగుతోందని విమర్మించారు. ముఖ్యమంత్రి ఉన్నా లేనట్లుగానే పరిస్థితి మారిందని షర్మిల వాపోయారు. కుర్చీ వేసుకుని కూర్చొని పట్టాలిస్తామని హామీ ఇచ్చి 8ఏండ్లు గడిచినా ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. పట్టాలుకావాలని అడిగితే చీరలు లాగుతున్నారంటే ఇది మహా భారతమా, రాష్ట్రంలో కొనసాగుతున్నది దృత రాష్ట్ర పాలనా అని షర్మిల ప్రశ్నించారు.