కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 70 వేల కోట్ల అవినీతి

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 70 వేల కోట్ల అవినీతి

కొల్లాపూర్​(నాగర్​కర్నూల్), వెలుగు: కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని రాష్ట్ర సర్కార్ చెబుతోందని, ఆ ప్రాజెక్టు పంప్ హౌస్ లు మునుగుడు కూడా అద్భుతమేనా? అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం మెగా మోసమని, ఇందులో దాదాపు రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో షర్మిల పాదయాత్ర చేశారు. నార్లాపూర్​లో మాట ముచ్చట నిర్వహించారు. అనంతరం సున్నపుతండా సమీపంలోని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు  వద్ద పాలమూరు నీళ్ల పోరు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అతీగతి లేకుండా పోయిందన్నారు. ‘‘పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని ప్రాజెక్టుల దగ్గర కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైంది. ఆయన పాలమూరు జిల్లాపై సవతి ప్రేమ చూపిస్తున్నారు. పాలమూరు జిల్లాలో 6.71 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో జిల్లాలో 5.30 లక్షల ఎకరాలు, నల్గొండ జిల్లాలో 1.23 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టారు. రూ. 35,200 కోట్ల అంచనాతో ప్రారంభించి, అంచనా వ్యయాన్ని రూ.65,000 కోట్లకు పెంచారు. కానీ  ఎనిమిదేండ్లయినా ఎందుకు పూర్తి చేయడం లేదు” అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులోనూ కమీషన్ల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. 

కృష్ణా నీళ్లలో వాటా వదులుకున్నారా? 
ఇన్నేండ్లు బీజేపీతో దోస్తీ చేసిన కేసీఆర్..పాలమూరు ప్రాజెక్టుకు పర్మిషన్లు ఎందుకు తెచ్చుకోలేదని షర్మిల ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టులో బ్లాస్టింగ్​తో కల్వకుర్తి పంప్ హౌస్ మునిగిపోయిందని.. పాలమూరు కట్టకుండానే, కల్వకుర్తిని నాశనం చేశారని మండిపడ్డారు. భూనిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కృష్ణా జలాల్లో వాటాపై రాష్ట్ర హక్కులను వదులుకున్నారా? అని అడిగారు.