కేసీఆర్ రూ.70 వేల కోట్ల కమీషన్ తీసుకుండు

కేసీఆర్ రూ.70 వేల కోట్ల కమీషన్ తీసుకుండు

రాష్ట్ర సర్కార్​పై షర్మిల ఫైర్  

గరిడేపల్లి/పెన్‌‌పహాడ్‌‌, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులు పరిహారం అడిగిన పాపానికి కేసులు పెట్టి జైలుకు పంపుతరా? అని రాష్ట్ర సర్కార్​పై వైఎస్సార్ టీపీ చీఫ్​ షర్మిల ఫైర్ అయ్యారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే సీఎం కేసీఆర్ రూ.70 వేల కోట్ల కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పి.. బార్లు, బీర్ల తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌‌ మండలం మాచారం, దూపహాడ్, గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో షర్మిల పాదయాత్ర చేశారు. గడ్డిపల్లిలో మాట ముచ్చట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘రైతులకు కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారు. రైతుబంధు ఇస్తున్నామని ఇన్ పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, పంట నష్ట పరిహారం.. ఇట్ల అన్ని బంద్ పెట్టారు. రూ.5 వేల రైతుబంధు ఇచ్చి రైతులను కోటీశ్వరులను చేస్తున్నానని భ్రమ పెడుతున్నారు” అని ఫైర్ అయ్యారు. కౌలు రైతులు.. అసలు రైతులే కాదన్న కిరాతక ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలను అసలు మనుషుల్లా కూడా చూడట్లేదని, దేనికైనా వాళ్ల భూములనే బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ టీపీ అధికారంలోకి వస్తే, మళ్లీ రాజన్న పాలన తీసుకొస్తామన్నారు.