
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర వచ్చింది కాబట్టి సీఎం కేసీఆర్ కు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించాలనే అలోచన వచ్చిందనిని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్ టాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని.. విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదని మండిపడ్డారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమాన పరిచాడని ఫైర్ అయ్యారు షర్మిల.
కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులు లేవు..కేసీఆర్ రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు కొట్లాడే హక్కు లేదని షర్మిల ఎద్దేవ చేశారు. దళితులను అన్ని రకాలుగా కేసీఆర్ మోసం చేశారన్నారు. తెలంగాణను ఒక ఆఫ్గనిస్తాన్ తయారు చేసి కేసీఆర్ ఒక తాలిబాన్ నేత మారారని షర్మిల దుయ్యబట్టారు. తెలంగాణలో రాజ్యాంగం ఉందా అని ప్రశ్నించారు. ఇండియన్ రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కొట్లాడే స్వచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు షర్మిల. కేసీఆర్ అంబేడ్కర్ వారసుడు అని అంటున్నారు.. దీనికంటే పెద్ద జోక్ లేదని ఎద్దేవ చేశారు. తెలంగాణలో దళితుల బతుకుల్లో మార్పు రాలేదు..దళితులను జైల్లో పెట్టి చిత్రహింసలు చంపుతున్నారని ఆరోపించారు. ఆన్ని పాలసీలకు దళితుల భూమి దోచుకుంటున్నారు. దళితులను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారని వ్యాఖ్యనించారు షర్మిల.
కేసీఆర్ అంబేడ్కర్ వారసుడు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలని ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా కేసీఆర్ కి రాజ్యాంగాన్ని గిఫ్ట్ గా ఇస్తున్నట్లు ప్రకటించారు షర్మిల. 80 వేల పుస్తకాలు చదివానని చెప్తున్న కేసీఆర్ రాజ్యాంగం చదవలేదని అన్నారు. కేసీఆర్ కి రాజ్యాంగాన్ని తానే స్వయంగా ఇవ్వాలని అనుకుంటున్నానని షర్మిల వెల్లడించారు. కేసీఆర్ కి రాజ్యాంగం పుస్తకం ఇవ్వడానికి అంబేడ్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లి నిల్చుంటానన్నారు వైఎస్ షర్మిల.