
హైదరాబాద్, వెలుగు: చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కేసీఆర్ ఒక్కో గ్రామ సర్పంచ్ కు రూ.5లక్షల నుంచి రూ.30లక్షల దాకా ఎగనామం పెట్టారని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. పెండింగ్ బిల్లులు రాక, అప్పులు పుట్టక, అవమానంతో రాష్ట్రంలో ఇప్పటికే 11మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినా కేసీఆర్ స్పందించట్లేదని మండిపడ్డారు. ‘‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లు ఉంది కేసీఆర్ తీరు. పంచాయతీలకు నిధులివ్వరు. అటు కేం ద్రం నుంచి వచ్చిన పదోపరకో దక్కనివ్వరు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలంటారు కానీ మన రాష్ట్రంలో ఆ కొమ్మలకే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి” అని షర్మిల అన్నారు.
ప్రభుత్వంపై నమ్మకం తో సర్పంచులు అప్పులు తెచ్చి, పనులు చేయిస్తే.. గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని.. రివార్డులు తీసుకుంటున్న కేసీఆర్.. బిల్లులు మాత్రం చెల్లించడం లేదని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో మండిపడ్డారు. కార్మికుల జీతాలు చెల్లించలేక, కరెంట్ బిల్లు లు, ట్రాక్టర్ల ఈఎంఐలు.. డీజిల్ ఖర్చులు భరించలేక మహిళా సర్పంచులు మెడలో తాళి బొట్టు అమ్మి చెల్లిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో 18 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామా చేసి సర్కార్ చెంప చెళ్లుమనిపించారని అన్నారు.