సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. దళితబంధు అమలులో ఒక్కో ఎమ్మెల్యే మూడు లక్షల రూపాయలు తీసుకుంటుండని పార్టీ ప్లీనరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అవినీతి చేశారని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
దళితబంధులో ఒక్కో కుటుంబం వద్ద రూ.3లక్షలు తిన్న ఎమ్మెల్యేలను కేసీఆర్ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. ఎమ్మెల్యేల పేర్లు బయటపెడితే కాళేశ్వరంలో మీరు తిన్న రూ.70వేల కోట్ల గురించి, బిడ్డ లిక్కర్ స్కాం, కొడుకు రియల్ ఎస్టేట్ స్కాంపై ప్రశ్నిస్తారని భయమా? అని అన్నారు. దమ్ముంటే అవినీతి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు.
తప్పు చేస్తే తన బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదని.. జైలుకు పంపుడే అన్న కేసీఆర్.. ఇప్పుడు ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని మీరే ఒప్పుకున్నా ఎందుకు చర్యలు తీసుకోవం లేదన్నారు షర్మిల. ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నా కండ్లు తుడుచుకొని చేతకాని దద్దమ్మలా ఎందుకున్నారని ప్రశ్నించారు.
అయినా నీ బంగారు బతుకమ్మే బాగా లేనప్పుడు..ఇతరులను శిక్షించే అర్హత మీకెక్కడిదంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు షర్మిల. అవినీతి పాలనలో మునిగి తేలిన మీకు, మీ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారని...మీ అధికారాన్ని దూరం చేస్తారని విమర్శించారు.