బంగారు తునక రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశావ్

బంగారు తునక రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశావ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని పాలించడమే చేతకాని సీఎం కేసీఆర్.. దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని వైఎస్సార్‌‌టీపీ చీఫ్​షర్మిల అన్నారు. “రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని పట్టం కడితే.. ఉన్నది తిన్నవ్.. అప్పు తెచ్చినది తిన్నవ్.. బంగారు తునక రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశావ్. రైతులు, నిరుద్యోగులు సచ్చేలా చేశావ్. దొంగలను కలుపుకొని.. దేశం నాకు పట్టం కడుతుందని.. పగటి కలలు కంటూ.. దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటూ.. స్వార్థం కోసం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినవ్  కేసీఆర్” అని బుధవారం షర్మిల ట్వీట్ చేశారు. ఇక్కడ పరిపాలనే చేతకాని మీరు దేశాన్ని ఉద్ధరిస్తరా? రాష్ట్ర ప్రజలను పట్టించుకోని మీకు దేశం ఎలా పట్టం కడుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల తరుఫున పోరాడుతున్న ఏకైక ప్రాంతీయ పార్టీ తమదేనన్నారు. 

ఢిల్లీ వెళ్లిన షర్మిల
షర్మిల గురువారం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఆమె కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. తెలంగాణలో వైఎస్సార్‌‌టీపీ ఏర్పాటు, లక్ష్యాలు, పలు అంశాలపై మీడియాకు వివరించనున్నట్లు సమాచారం. షర్మిలతో గట్టు రాంచందర్ రావు, పిట్టా రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, తుడి దేవేందర్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ తమిళి సై ని , ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.