దళితబంధు ఒక బోగస్

దళితబంధు ఒక బోగస్

ధర్మపురి, వెలుగు: దళితబంధు ఒక బోగస్ అని, టీఆర్ఎస్ నేతలకు ఇచ్చే బంధుగా మారిందని వైఎస్సార్‌‌‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.  ఆమె పాదయాత్రలో బుధవారం జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల పరిధిలో తిప్పన్నపేట, పొలాస, అనంతారం, టక్కలపల్లి మీదుగా ధర్మపురం నియోజకవర్గంలోని బుగ్గారం మండల పరిధిలో చిన్నాపూర్, నెరేళ్ల గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా బుగ్గారం మండలం నేరేళ్ల గ్రామంలో స్థానికులతో నిర్వహించిన మాటా ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

బంగారు తెలంగాణ అని చెప్పి తన కుటుంబాన్ని కేసీఆర్ బంగారుమయం చేసుకున్నారని షర్మిల విమర్శించారు. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని దోపిడీ చేసి ప్రజలపై రూ. 4 లక్షల కోట్ల అప్పు మోపారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక బీఆర్ఎస్ పేరుతో ఇపుడు దేశంమీద పడి దోచుకోవాలని చూస్తున్నారని ఫైరయ్యారు. బంగారు తెలంగాణను బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణ గా మార్చారని విమర్శించారు. ఎన్నికలు ఉంటేనే మన దొర ఫామ్ హౌజ్ నుంచి బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజల కోసం కొట్లాడే పార్టీ లేదని, తమ పార్టీ మాత్రమే ప్రజల కోసం కొట్లాడుతోందని అన్నారు. వైఎస్ సంక్షేమ పాలన తిరిగి తీసుకువచ్చే సత్తా  తమ పార్టీ కే ఉందన్నారు.