మే 12 నుంచి పాలేరులో షర్మిల పాదయాత్ర

మే 12 నుంచి పాలేరులో షర్మిల పాదయాత్ర
  • 20 రోజులపాటు పర్యటన.. 4 మండలాల్లో సభలు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 12 నుంచి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల పాదయాత్ర చేపట్టనున్నారు. అన్ని గ్రామాలు, తండాల్లో 20 రోజుల పాటు పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. పాదయాత్రలో భాగంగా కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లిలో పబ్లిక్ మీటింగ్ లు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల.. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వాస్తవానికి ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభను నియోజకవర్గంలో నిర్వహించాలని షర్మిల భావించారు. కానీ అది మధ్యలోనే ఆగిపోవడంతో ఆ మీటింగ్ రద్దయింది.  

తడిసిన వడ్లు ఎప్పుడు కొంటున్నరు? 

తడిసిన వడ్లను ఎప్పటినుంచి కొంటారో చెప్పాలని షర్మిల శనివారం ట్విట్టర్​లో డిమాండ్​ చేశారు. వడ్లు రోడ్లమీద ఆరబోసి రైతులు ఎదురుచూస్తున్నారని, కటిక చీకట్లో కాపలా కాస్తున్నారని అన్నారు.  వానలు పడి వడ్లు తడిసిపోతున్నా సర్కారు కొనుగోలు సెంటర్లను మాత్రం తెరవడం లేదన్నారు. రాష్ట్రంలోని సమస్యలకన్నా కేసీఆర్​కు జాతీయ రాజకీయాలే ముఖ్యమైపోయాయన్నారు. తడిసిన వడ్లు కొనడంతోపాటు ఎకరాకు రూ. 30 వేల నష్టపరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మీ పార్టీలో చేరిన వ్యక్తికి రూ.18 లక్షల ప్యాకేజీతో ఉద్యోగమిస్తావా అని షర్మిల ఫైరయ్యారు. పార్టీ కార్యకర్తలకు కొలువులు ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.