కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుంది

కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుంది

హైదరాబాద్: రైతులను కోటీశ్వరులను చేశానని నిన్న ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఫైర్ అయ్యారు. రైతులను కోటీశ్వరులను చేస్తే ఏడేండ్లలో 8 వేల మంది అన్నదాతలు ఎందుకు చనిపోయారని ఆమె ప్రశ్నించారు. వడ్లు కొనకుండా ప్రభుత్వం రైతుల ఉసురు తీసుకుంటోందని ఆరోపించారు. వడ్లు కొనలేనప్పడు పదవికి రాజీనామా చేయాలని.. కేసీఆర్ రైతు ద్రోహి అని విమర్శించారు. ఆయన వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. 

కేంద్రాన్ని వెంబడిస్తాం, మెడలు వంచుతామన్న కేసీఆర్.. మెడలు వంచుకొని వడ్లు కొనేది లేదంటున్నారని షర్మిల చెప్పారు. పేగులు తెగే దాకా కొట్లాడానని చెప్పి.. కేంద్రం తీగ లాగితే అవినీతి పేగులు కదులుతాయని కొట్లాట బంద్ పెట్టారన్నారు. రైతులు గల్లా పట్టుకుంటారని భయపడి తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. రైతులను ఆదుకుంటానని భరోసా ఇచ్చి.. నట్టేట ముంచితే ఎలా అని క్వశ్చన్ చేశారు. 

ఎవర్ని అడిగి లక్షల కోట్లు అప్పులు చేసి కాళేశ్వరాన్ని కట్టారని షర్మిల ప్రశ్నించారు. రైతుల వడ్లు కొనలేనప్పుడు ఈ ప్రాజెక్టులు కట్టి ఏం లాభమన్నారు. కమీషన్ల కోసమే చివరి ఆయుకట్టు వరకు నీళ్లిస్తామని చెప్పారా అని సూటిగా ప్రశ్నించారు. ఆకుపచ్చ తెలంగాణ అంటే రైతులను ఆగం చేయడమేనా అని దుయ్యబట్టారు. చివరి గింజ వరకు కొంటానని చెప్పి చేతులెత్తేశారని విమర్శించారు. కొండంత రాగం తీసి ఏదో పాట పడినట్లుంది కేసీఆర్ తీరు అని మండిపడ్డారు.