కాళేశ్వరం అబద్ధాల ప్రాజెక్టు.. మూడేండ్లకే ఎట్ల మునిగింది?

కాళేశ్వరం అబద్ధాల ప్రాజెక్టు.. మూడేండ్లకే ఎట్ల మునిగింది?

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌, మేఘా కృష్ణారెడ్డి ఇద్దరూ పార్ట్‌‌‌‌నర్స్‌‌‌‌ అని, జనం సొమ్ము తినడమే వీరిద్దరి ధ్యేయమని వైఎస్సార్‌‌‌‌టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో 80 శాతం పనులు మేఘా కృష్ణారెడ్డికే అప్పగిస్తే.. రూ.70 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 12 వేల కోట్ల జీఎస్టీని ప్రభుత్వానికి కట్టాల్సి ఉందని, ఆయన్ని జైలులో పెట్టి సిట్టింగ్‌‌‌‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘‘విజయ్ మాల్యాను కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసినట్లు, అదానీని బీజేపీ ప్రమోట్ చేసినట్లు మేఘా కృష్ణారెడ్డిని కేసీఆర్‌‌ ప్రమోట్ చేస్తున్నారు’’ అని ఆరోపించారు. ‘‘కాళేశ్వరం ఒక అబద్ధాల ప్రాజెక్ట్. ప్రజలను మోసం చేసి కట్టిన ప్రాజెక్ట్‌‌‌‌. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ వల్ల రాష్ట్రం అప్పులపాలైంది. ఇక్కడ ఎత్తిపోసిన నీళ్లతో ఒక్క ఎకరాన్ని కూడా తడపలేదు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి.. వరి వేస్తే ఉరి అన్న సన్నాసి ముఖ్యమంత్రి కేసీఅర్” అని షర్మిల ఫైర్​ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోతే కృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం పరిశీలనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ మండలంలోని అన్నారం బ్యారేజీ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. చంద్రుపల్లి, అన్నారం గ్రామాల ముంపు బాధితులతో మాట్లాడారు. కన్నెపల్లి పంప్‌‌హౌస్‌‌ దగ్గరికి వెళ్లే క్రమంలో అన్నారం క్రాస్‌‌‌‌ రోడ్డు వద్ద 353 సీ నేషనల్‌‌‌‌ హైవేపై పోలీసులు షర్మిల కాన్వాయ్‌‌ని అడ్డుకున్నారు. పోలీసులు పర్మిషన్‌‌‌‌ ఇవ్వకపోవడంతో షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించి గంటసేపు ధర్నా చేశారు. దీంతో నేషనల్‌‌‌‌ హైవే రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ అయ్యింది. ప్రజల ఇబ్బందులను గమనించిన షర్మిల.. ధర్మాను విరమించి అక్కడి నుంచి కదిలారు.

అప్పుల కుప్ప తప్ప సాధించిందేం లేదు

‘‘మా నాన్న వైఎస్సార్ హయాంలో ఇదే గోదావరి నదిపై 18 ఏళ్ల క్రింద కట్టిన దేవాదుల ప్రాజెక్ట్ మునగలేదు. కానీ కేసీఆర్​కట్టిన కాళేశ్వరం ‌‌‌‌మూడేండ్లకే ఎట్ల మునిగింది. ప్రజలకు సీఎం కేసీఆర్‌‌‌‌ సమాధానం చెప్పాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు. అప్పుల కుప్ప, కరెంట్‌‌‌‌ బిల్లులు, రిపేర్‌‌‌‌ ఖర్చులు తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాధించిందేమీ లేదని అన్నారు. కేసీఆర్ చేతకానితనానికి నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ అని ఫైరయ్యారు. మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. 

మేఘా కృష్ణారెడ్డి సంపదంతా ప్రజల సొమ్మే

‘‘మేఘా కృష్ణారెడ్డి చేసిన నాణ్యత లేని పనుల వల్లే కాళేశ్వరం పంప్‌‌‌‌హౌస్‌‌లు మునిగాయి. కాంక్రీట్‌‌‌‌తో కట్టిన ప్రొటెక్షన్ వాల్ కూడా కూలిపోయిందంటేనే పనులు ఎలా జరిగాయో అర్థం చేసుకోవచ్చు” అని మండిపడ్డారు. కాళేశ్వరం తో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు కానీ బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌తో 40 వేల ఎకరాలు ఏటా నీట మునుగుతున్నాయని, రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ‘‘మేఘా కృష్ణారెడ్డి ఒక్కడికే రాష్ట్రంలో 80% ప్రాజెక్టులు కట్టబెట్టారు. ఆయనకే ఇన్ని పనులు ఎందుకు ఇస్తున్నారు? దేశంలో సంపన్నుల జాబితాలో మేఘా కృష్ణారెడ్డి పేరు ఉంది. ఈ సొమ్ము అంతా తెలంగాణ ప్రజలదే. మొత్తం అవినీతి చేసి సంపాదించినదే” అని అన్నారు. కాగా, తాడ్వాయి రూట్‌‌లో పెద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో షర్మిల కాన్వాయ్‌‌  తాడ్వాయి ఫారెస్ట్‌‌లో గంట సేపు ఆగిపోయింది. వరద తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో షర్మిల వెనక్కి తిరిగి పస్రా మీదుగా బయ్యారం వెళ్లారు.