మీ పార్టీ ఆవిర్భావం నాడే మరో నిరుద్యోగి బలయ్యాడు

మీ పార్టీ ఆవిర్భావం నాడే మరో నిరుద్యోగి బలయ్యాడు

రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతో ఆత్రుతగా.. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ, నోటిఫికేషన్లు మాత్రం రావడంలేదు. కాకతీయ యూనివర్సిటి విద్యార్థి సునీల్ నాయక్ మరణం మరవకమందే.. మరో విద్యా కుసుమం నేలరాలింది. నల్లొండ జిల్లాలో పాక శ్రీకాంత్ అనే నిరుద్యోగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుద్యోగుల మృతితో కలతచెందిన వైఎస్ షర్మిల.. ఇకనైనా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ పత్రికా ప్రకటన ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.

‘అయ్యా కేసీఆర్ సారు.. ఉద్యమ సమయంలో చందమామల్లాంటి పిల్లలు చనిపోతున్నారని మొసలి కన్నీళ్లు కార్చినవే.. మరి ఈ రోజు మీ పాలనలోనే ఎంతో మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకొంటుంటే నీకు కనిపించడం లేదా? ‘నేను చేతకాక చనిపోవడం లేదు.. కనీసం నా చావుతోనైనా ఉద్యోగాలు వస్తాయని’ సెల్ఫీ వీడియో తీసుకోని మరి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ చనిపోతే.. కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేకపోవడం దారుణం. నీళ్లు.. నిధులు.. నియామకాలు, తెలంగాణ రాష్ట్రం కోసమే టీఆర్ఎస్ పార్టీని స్థాపించినవ్. తెలంగాణ వచ్చింది.. నీకు అధికారం వచ్చింది.. గద్దెనెక్కిన నువ్వు మీ హామీలు మరిచినవ్.. నిరుద్యోగులను విస్మరించినవ్. 

‘కనీసం మీ పార్టీ పుట్టిన రోజైనా చస్తే మా నిరుద్యోగులను గుర్తిస్తారేమోనని’.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక మనస్థాపానికి గురై నిన్న నల్గొండ జిల్లా నిరుద్యోగి శ్రీకాంత్ (ఎంఎస్సీ (బోటనీ)) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నడు. ఇంతకంటే అవమానం మీ పార్టీకి ఏం కావాలి? వందల్లో నిరుద్యోగ యువత చనిపోతున్నా.. మీరు గాని.. మీ మంత్రులు గాని వారికీ భరోసా కలిపించే ప్రయత్నమే చేయలేదు. ఉద్యోగాలు ఇస్తాం.. దయచేసి ఎవ్వరు చనిపోకండి అని ఏ నాయకుడైనా చెప్పాడా? లేదు. మీకు చెప్పీ.. చెప్పీ.. విసిగిపోయిన నిరుద్యోగులు ఈ రోజు మీ పార్టీ పుట్టిన రోజే చనిపోయి.. మీ పార్టీ అస్థిత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి.. మీరు ఏ ఆశయాల కోసం పార్టీ స్థాపించారో.. దయచేసి ఇప్పటికైనా నిరుద్యోగుల చావులను ఆపండి. వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయండి. ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను నింపాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులు అధైర్యపడొద్దు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధం. నిరుద్యోగ యువతను.. మీ అక్కగా నేను కోరేది ఒక్కటే.. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. రేపటి భవిష్యత్తు కోసం.. నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం మనం కలిసి పోరాడుదాం’ అని వైఎస్ షర్మిల పత్రికా ప్రకటన విడుదల చేశారు.