కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం: షర్మిల

కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద  స్కాం: షర్మిల

కాళేశ్వరం దేశంలోనే  అతిపెద్ద స్కాం అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. 2జీ, బొగ్గు కుంభకోణాల కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగిందన్నారు. ఈ ప్రాజెక్ట్ లో రూ.1.20 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ (NBF) కాంక్లేవ్ లో మాట్లాడిన ఆమె..   దేశంలో ఇంత పెద్ద స్కాం జరిగినా నేషనల్ మీడియా ఎందుకు కవర్ చేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ను నేషనల్ మీడియా ఎందుకు ప్రశ్నించలేదన్నారు. 

వైఎస్సార్ రూ.38వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి.. 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భావిస్తే.. కేసీఆర్ కమీషన్ల కోసం ప్రాజెక్టు పేరు మార్చిండని ఆరోపించారు. కేసీఆర్  ప్రాజెక్ట్  డిజైన్ మార్చి  రూ.1.20 లక్షల కోట్లకు వ్యయం పెంచిండన్నారు.  అంత ఖర్చు పెట్టినా 2 లక్షల ఆయకట్టు కూడా పెరగలేదన్నారు.  కాగ్ దీనిపై ఎంక్వైరీ చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

వైఎస్సార్  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పాదయాత్ర నుంచి పుట్టినవేనని వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ వాటిని సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే పాదయాత్ర మొదలుపెట్టామన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని, భరోసా కల్పించి, వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. తన  గతం తెలంగాణలోనేనని..తన భవిష్యత్తు కూడా తెలంగాణలోనే అని తెలిపారు. తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేని అన్నారు.  తెలంగాణలో పుట్టా..చదువుకున్నా..పెళ్లి చేసుకున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని షర్మిల వ్యాఖ్యానించారు..

ఒక మహిళగా నిరుద్యోగుల కోసం పోరాడితే ముఖ్యమంత్రి కొడుకే ‘వ్రతాలు’ అంటూ తనను అవమానించారని షర్మిల అన్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తే మంగళవారం మరదలు అంటూ మరో మంత్రి అవమానించారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.