మా అన్న మీద అలిగి పార్టీ పెట్టలేదు

మా అన్న మీద అలిగి పార్టీ పెట్టలేదు

తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని, కేసీఆర్ ఓ డిక్టేటర్ అని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను తీరుస్తూ.. వారికి అండగా ఉంటూ ముందుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ ఆమె ఈ రోజు లోటస్ పాండ్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేశారని కొందరు అంటున్నారు. ఆయన తెలంగాణకు వ్యతిరేకమా? కాదా? అని గ్రామాలలో అడిగి తెలుసుకోండి. ఆయన వల్ల లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వేల కుటుంబాలు నిలబడ్డాయి. ఆయన సీఎంగా ఉన్న 5 సంవత్సరాలలో 46 లక్షల ఇండ్లు కట్టించారు. ఇప్పుడున్న సీఎం లక్ష ఇండ్లు కూడా కట్టలేదు. మేం కానీ, మా కుటుంబం కానీ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదు. వైఎస్ఆర్ 2000 సంవత్సరంలోనే 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక రాష్ట్రం అవసరమని కేంద్రానికి మెమొరాండం ఇచ్చారు. 2004 మరియు 2009 ఎన్నికల్లో కూడా ప్రత్యేక తెలంగాణ అంశాన్ని యూపీఏ మేనిఫేస్టోలో పెట్టించారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు భయపడలేదు. ఆయన చనిపోయిన తర్వాతే మా గతి ఏంటి అని భయపడ్డారు. ఉద్యమంలో పాల్గొనని వారికి తెలంగాణపై ప్రేమలేదు అనడం కరెక్ట్ కాదు. ఉద్యమ సమయంలో ఆంధ్రావాళ్లను వెళ్లగొడతామని అన్నారు కాబట్టే.. ఆంధ్రవాళ్లు ఎదురుదాడి చేశారు. ఈ తెలంగాణ నా గడ్డ. ఈ గడ్డకు మేలు చేయడానికే నేను ఇక్కడకు వచ్చాను. నేను మా అన్న జగన్ మీద అలిగి, విబేధించి ఇక్కడ పార్టీ పెట్టలేదు. ఎవరైనా పుట్టింటి మీద అలిగితే వారితో మాట్లాడటం మానేస్తారు కానీ.. పార్టీలు పెట్టరు. నేను పెట్టిన ఈ పార్టీ ప్రజల పార్టీ. మా నాన్నా ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి.. ఆయన ఆశయాలు ఇక్కడ అమలుకావడంలేదు కాబట్టి ఈ పార్టీ పెట్టాను. ఈ పార్టీ పేరులోనే వైఎస్ఆర్ ఉన్నారు. ఈ పార్టీని అవమానించిన ప్రతిసారీ ఆయనను అవమానించినట్లే. రైతులు, నిరుద్యోగులు చనిపోతున్నారు. అన్ని కులాల వారికి సమాన న్యాయం దొరుకుతుందా? అందుకే ఇప్పుడు ఈ సమయంలోనే తెలంగాణలో కొత్త పార్టీ అవసరమని భావించి ఏర్పాటుచేశాం. ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం నేను కాదు. ఇక్కడి ప్రజల బాగోగుల కోసమే ఈ పార్టీ పుట్టింది. మహిళలు పార్టీ పెట్టకూడదా? నేను ఉన్నా.. లేకున్నా.. ఈ పార్టీ ఉంటుంది.

వైఎస్ఆర్‌ను కాంగ్రెస్ పార్టీ సీఎం చేయలేదు

వైఎస్ఆర్ వారసులమని చెప్పుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు సిగ్గుండాలి. కాంగ్రెస్ 2004కు ముందు చచ్చిపోయిన పార్టీ. ఆ పార్టీని వైఎస్ఆర్ పాదయాత్ర పేరుతో మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చారు. వైఎస్ఆర్‌ను కాంగ్రెస్ సీఎం చేయలేదు. ఆయనే కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మొహం చూసి ఓటేయలేదు. వైఎస్ఆర్ మొహం చూసి ఓటేశారు. కోట్ల మంది ప్రజల హృదయాలలో వైఎస్ఆర్ బతికే ఉన్నారు. అలాంటప్పుడు నేను ఒంటరిని ఎలా అవుతాను. అయినా నాకు జంపింగ్ జపాంగులు వద్దు. నాకు నిఖార్సయిన నాయకులు కావాలి. ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి నాయకులను తయారుచేస్తా. ప్రభంజనం సృష్టిస్తా.. మీరు రాసి పెట్టుకోండి. 

సీఎం అంటే చీఫ్ మినిష్టర్ కాదు.. కామన్ మ్యాన్

ఏపీలో రాజన్న రాజ్యం ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ అక్కడ ప్రభుత్వం విఫలమైతే ప్రజలు ఊరుకోరు. గత ప్రభుత్వం చేసిన టెక్కులు, హైటెక్కులు వద్దనే అక్కడి ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సీఎం అంటే చీఫ్ మినిష్టర్ కాదు. సీఎం అంటే కామన్ మ్యాన్. ప్రజలే రాజులు” అని షర్మిల అన్నారు.