ఇక్కడే పెరిగా.. ఇక్కడే చదివా.. నేనూ తెలంగాణ బిడ్డనే

V6 Velugu Posted on Apr 10, 2021

  • బరాబర్  ఇక్కడ నిలబడ్తా.. 
  • ప్రజల కోసం కొట్లాడ్తా: వైఎస్​ షర్మిల
  • తెలంగాణ ఆత్మగౌరవం దొర ఎడమకాలి చెప్పుకింద నలుగుతోంది
  • కేసీఆర్ ఫాంహౌస్ కే నీళ్లు.. ఆయన ఫ్యామిలీకే నిధులు, నియామకాలు
  • రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం, జనం ఆకాంక్షలు నెరవేరలేదు
  • పర్సెంటేజీల కోసమే ప్రాజెక్టుల రీ డిజైనింగ్
  • రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నయ్
  • జులై 8 వైఎస్ జయంతి రోజు కొత్త పార్టీని ప్రకటిస్తా
  • ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం 15 నుంచి హైదరాబాద్​లో దీక్ష చేస్తా
  • ఖమ్మం సభలో వెల్లడించిన షర్మిల

దొర చెప్పిందే వేదం. దొర నంది అంటే నంది.. పంది అంటే పంది. దొర బాంచెన్.. అంటూ సాగిలపడిన వాళ్లకే రాజకీయ భవిష్యత్‍ ఉంటోంది. ఇప్పుడంతా కేసీఆర్‍  చుట్టూ భజన బ్యాచే తయారైంది. తాను తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తా అన్నడు. ఆ మాటలను అందరిలాగా నేను కూడా నమ్మిన. బంగారు తెలంగాణ తెస్తానన్నడు. బంగారు తెలంగాణ కాదుకదా.. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు.
‑ వైఎస్​ షర్మిల

కొత్తగూడెం, వెలుగు: అవునన్నా కాదన్నా, కొందరికి ఇష్టమున్నా లేకున్నా తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని వైఎస్​ షర్మిల స్పష్టం చేశారు. ‘‘ఇక్కడి గాలి పీల్చా.. ఇక్కడి నీళ్లు తాగా.. ఇక్కడే పెరిగా.. ఇక్కడే చదివా.. నా పిల్లల్ని ఇక్కడే కన్నా.. అలాంటి నాకు తెలంగాణపై ప్రేమ లేకుండా ఎట్లా ఉంటది..? అందుకే బరాబర్ తెలంగాణలో నిలబడతా.. ప్రజల కోసం కొట్లాడతా..’’ అని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఇంకా నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం దొర ఎడమకాలి చెప్పుకింద పడి నలుగుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రాజెక్టుల నీళ్లు కేసీఆర్ ఫాంహౌస్ కు.. నిధులు, నియామకాలు ఆయన ఫ్యామిలీకే దక్కుతున్నాయని, రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్​లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రజాసంకల్ప బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని, జులై 8న వైఎస్ జయంతి రోజు కొత్త పార్టీ, జెండా, అజెండా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు ఆమె మాజీ సీఎం వైఎస్​ రాజశేఖర​రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి వివరించారు. 

ఉద్యమ గుమ్మం ఖమ్మం నుంచే రాజకీయంగా తాను అడుగు పెడ్తున్నట్లు షర్మిల చెప్పారు. ‘‘సీఎం కేసీఆర్​ తెలంగాణ ఉద్యమంలో అందరినీ వాడుకున్నరు. పాలనకొచ్చే సరికి దొరగారి బంధువులకే అంతా అప్పగించారు. అన్ని పదవులు వాళ్ల కుటుంబసభ్యులే నిర్వహిస్తున్నారు. ఇప్పుడంతా కేసీఆర్‍చుట్టూ భజన బ్యాచే తయారైంది. తాను తప్పు చేస్తే ముక్కు రాస్తా అన్నడు. ఆ మాటలను అందరిలాగా నేను కూడా నమ్మిన. బంగారు తెలంగాణ తెస్తానన్నడు. కానీ బంగారు తెలంగాణ సాధ్యం కాలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రాజెక్టులు కట్టి తెచ్చిన నీళ్లు కేసీఆర్​ ఫాంహౌస్‍కే పోతున్నయి. నిధులు, నియామకాలు కేసీఆర్​ ఇంటికే పోతున్నయ్” అని ఫైర్​ అయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా కేసీఆర్​ అపాయింట్‍మెంట్‍ దొరుకుతలేదన్నారు. ‘‘దొర చెప్పిందే వేదం, దొర నంది అంటే నంది.. పంది అంటే పంది. దొర బాంచెన్ అంటూ సాగిలపడిన వాళ్లకే రాజకీయ భవిష్యత్‍ ఉంటోంది. కేసీఆర్​ ఎన్నికల ముందు ఒకలాగ, ఎన్నికల తర్వాత ఇంకోలా  మారుతారు. నేను అడుగు పెట్టని సచివాలయం ఎందుకంటూ దానిని కూడా కూల్చేశారు” అని విమర్శించారు.  ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ఏమాత్రం నెరవేరలేదన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ తల, తోక తీసేసి రీ డిజైనింగ్​ పేరుతో  రూ. 30వేల కోట్ల ప్రాజెక్టును రూ. 1.30 లక్షల కోట్లకు పెంచేశారని, ఇది అవినీతి కాదా? అని ప్రశ్నించారు. ఇదంతా పర్సంటేజీల కోసమేనని ఆరోపించారు. 

ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది?
‘‘ప్రతి ఇంటికి ఉద్యోగమన్న మాట ఏమైంది కేసీఆర్‍  సారూ. నిరుద్యోగ భృతి సంగతేంటి సారూ. ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటేనే ఉద్యోగం వస్తుందని జనం అనుకుంటున్నరు. కొత్త రేషన్​ కార్డు లేదు. కొత్త పింఛన్లు లేవు. కార్పొరేషన్‍ లోన్లు లేవు. దళితులకు మూడెకరాల భూమి లేదు. బడుగు, బలహీన వర్గాల గురించిన ధ్యాసే లేదు.  రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది?” అని షర్మిల ప్రశ్నించారు.  రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పేర్ల మీద రూ. వేలు. రూ. లక్షల కోట్లు అప్పులు తెచ్చుకుంటూ పాలకులు జేబులు నింపుకుంటున్నారని, అందుకే  ప్రజల తరఫున పాలకులను ప్రశ్నించేటందుకే కొత్త పార్టీ పెడ్తున్నట్లు ప్రకటించారు. ప్రశ్నించడానికే తమ పార్టీ అవసరమని చెప్పారు.

వైఎస్సార్ జయంతి రోజు కొత్త పార్టీ ప్రకటన
వైఎస్సార్‍ జయంతి రోజైన జులై 8న కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తానని వైఎస్​ షర్మిల వెల్లడించారు. రాజన్న సంక్షేమ పాలన, ఉద్యమ ఆకాంక్ష, ఆత్మగౌరవం కోసమే పార్టీ పెడ్తున్నానని చెప్పారు. సింహం సింగిల్‍గానే వస్తుందని, ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన  ప్రజా బాణం తామని పేర్కొన్నారు. ‘‘మేం టీఆర్‍ఎస్​ చెప్తే రాలేదు. బీజేపీ అడిగిందని రాలేదు. కాంగ్రెస్​ పంపితే రాలేదు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వస్తున్నాం. పార్టీ పెడ్తున్నా. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం పోరాడుతాం. పనిచేస్తాం. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ రాజన్న రాజ్యం తెస్తా. మా పార్టీ ఎవరికిందా పని చేయదు. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదలుకోం’’ అని ఆమె స్పష్టం చేశారు. 

ఈ నెల 15 నుంచి దీక్షలు 
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం 30 మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని షర్మిల విమర్శించారు. నోటిఫికేషన్ల కోసం రోజుకొకరు ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్స్ నోటిఫికేషన్‍ వేయాలని, లేదంటే ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‍లో తానే  దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు. అప్పటికీ సర్కారు స్పందించకుంటే జిల్లాల్లో నిరాహార దీక్షలు కొనసాగుతాయని, లక్షా 91 వేల జాబ్స్ నోటిఫికేషన్లు వచ్చే దాకా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.       

నా బిడ్డను ఆశీర్వదించండి: విజయమ్మ
తన బిడ్డను ఆశీర్వదించాలని షర్మిల తల్లి వైఎస్‍ విజయమ్మ ప్రజా సంకల్ప మీటింగ్‍లో ప్రజలను కోరారు. ‘‘నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా. తాను ఎంచుకున్న దారి కఠిన మైనదే. వేసే ప్రతి అడుగు తెలంగాణ కోసమే’’ అని అన్నారు. 

భారీ బందోబస్తు 
హైదరాబాద్​ నుంచి షర్మిల భారీ కాన్వాయ్‍తో శుక్రవారం సాయంత్రం ఖమ్మం చేరుకున్నారు. టౌన్​ బార్డర్​ పాలేరులో ఆమెకు ప్రజలు, నేతలు ఘన స్వాగతం పలికారు. షర్మిల ప్రజా సంకల్ప సభ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ‘సీఎం.. సీఎం..’ అంటూ నినాదాలు చేశారు. షర్మిలను కలిసేందుకు అభిమానులు తోసుకుంటూ వెళ్లగా, సిబ్బంది అడ్డుకోవడంతో కొంత తోపులాట జరిగింది. ఈ ప్రోగ్రాంలో కొండా రాఘవరెడ్డి, లక్కినేని సుధీర్‍, ఇందిర తదితర నేతలు పాల్గొన్నారు. టీఆర్‍ఎస్‍  లీడర్‍, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ చైర్‍పర్సన్‍  గడిపల్లి కవిత షర్మిల  పెట్టబోయే పార్టీలో చేరుతానని ప్రకటించారు.

Tagged Telangana, YS Sharmila, YS Rajashekar Reddy, YS Sharmila New Party, YS Vijayamma

Latest Videos

Subscribe Now

More News