ప్రజల బతుకులు మార్చడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

ప్రజల బతుకులు మార్చడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

యాదాద్రి: ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పేరుతో ఆమె చేస్తున్న పాదయాత్ర 35వ రోజు మోత్కూరు మండలంలో కొనసాగింది. ఆనంతరం నిర్వహించిన మాట ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

‘పేదల కోసం 46 లక్షల ఇండ్లు కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే సొంతం. పేదల కోసం ఆయన ఎన్నో పనులు చేశారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ మాత్రం పేదలను పట్టించుకోవడంలేదు. కేసీఆర్ రూ. 200 పెన్షన్ ఇస్తున్నాడు, కానీ అవి దేనికీ సరిపోవడం లేదు. రాష్ట్రంలో అప్పులేని రైతు, అప్పులేని కుటుంబం లేదు. రైతుబంధు అని రూ. 5000 ఇస్తుండు. కానీ, ఎరువుల సబ్సిడీ లేదు, పంట నష్టపరిహారం లేదు. వరి కూడా వేయొద్దు అంటున్నాడు. వేస్తే పంట కొనేది లేదని తెగేసి చెప్పి రైతులను భయపెడుతున్నడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టిండు. నీళ్లను ఎత్తి పోస్తున్నమంటూ.. ఆఖరికి నీళ్లను సముద్రంలోనే కలుపుతుండు. ప్రాజెక్టుల పేరుతో  కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కమీషన్లు తీసుకున్నాడు.

వడ్లు కొనే బాధ్యత ఎవరిది? ఓట్లు వేసింది ఎవరికి? కేసీఆర్ మాటలను నమ్మి రెండుసార్లు గెలిపిస్తే రైతుని బానిస చేశాడు. లక్షా 90 వేల ఉద్యోగాలు ఉంటే అందులో 90 వేల ఉద్యోగాల్లో 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేశాడు. పిల్లల కోసమైనా ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియం అంటుండు కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పేవాడు సరిగా లేడు. చదువు లేదు, రుణమాఫీ లేదు. ఎవరైనా ఆలోచిస్తున్నారా? మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకుపోయినట్లుంది. తెలంగాణ పేరు మీద కేసీఆర్ 4 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఒక్కో కుటుంబం మీద 4 లక్షల అప్పు చేసిండు.  

కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే.. గెలిచిన వారిని పశువులను కొన్నట్టు కొన్నాడు. ఇది రాజకీయ వ్యభిచారం కాదా? ప్రతి పక్షాలు, ప్రభుత్వం ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయి. మోడీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతుండు. మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డను.. తెలంగాణ ప్రజల బతుకులు మార్చడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి’ అని షర్మిల కోరారు.

For More News..

జడ్పీ చైర్మన్ తలపై కొట్టిన మంత్రి ఎర్రబెల్లి

కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో బండి.. రైతులను మోసం చేస్తుండ్రు

వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తాం