కేసీఆర్ ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : షర్మిల

కేసీఆర్ ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : షర్మిల

సీఎం కేసీఆర్ కొత్తగూడెం సభలో మాట్లాడిన ప్రసంగంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రసంగం వింటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజైనా ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను, కనీసం జర్నలిస్టులకైనా గౌవరం ఇచ్చారా అంటూ షర్మిల ట్విట్టర్ లో ప్రశ్నించారు. 

 

అవసరం లేకున్నా కాళేశ్వరం నిర్మించి మూడేండ్లకే ముంచేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. అందినకాడికి కమీషన్లు దోచుకున్నారని మండిపడ్డారు. ‘మీ పాలనలో తెలంగాణ దూసుకెళ్తోంది అభివృద్ధిలో కాదు దొర. అప్పులు, ఆత్మహత్యల్లోనే దూసుకెళ్తోంది’ అని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని దొర.. ఎన్నికల్లో హామీ ఇస్తే నెరవేర్చాలని శ్రీరంగనీతులు చెబుతున్నారని మండిపడ్డారు.

‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా..? రైతు రుణమాఫీ ఏది ? ఇంటికో ఉద్యోగం ఏది ? డబుల్ బెడ్రూం ఇల్లు ఏది ? దళితులకు మూడెకరాల భూమి ఏది? నిరుద్యోగ భృతి ఏది? పోడు పట్టాలు ఏవి? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు. తెలంగాణను అప్పుల పాలు చేసి, పోలీసులను పనోళ్లలా వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దొరల పాలన సాగిస్తూ తాలిబాన్ల రాజ్యంగా మార్చేశారని షర్మిల ఆరోపించారు.