పదేండ్లలో కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లు : షర్మిల

పదేండ్లలో కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లు : షర్మిల

పదేండ్లలో సీఎం కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లేనని  వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.  కేసీఆర్ ప్రసంగమంతా అబద్ధాలమయం, అరచేతిలో వైకుంఠమని విమర్శించారు. రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోతుందో లేదో తెలియదు కానీ కేసీఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటుందని చెప్పారు. రెండు సార్లు  ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు పెరిగితే .. ఒక్కొక్కరి మీద రూ.1.50లక్షల అప్పు ఎందుకు ఉన్నట్లని షర్మిల ప్రశ్నించారు.  2014లో రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రం.. 2023 నాటికి 5 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు చేరుకున్నట్లని నిలదీశారు.  జలయజ్ఞం ప్రాజెక్టులను సొంత ప్రాజెక్టులుగా చెప్పుకోడానికి కేసీఆర్ కు  సిగ్గుండాన్నారు. డిజైన్ మార్చి లక్ష కోట్లకు పెంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని కాళేశ్వరం కట్టి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు.  

10 ఏళ్లుగా కేసీఆర్  చేసింది లేదన్న షర్మిల...  ఎన్నికల్లో ఓట్ల కోసం పోడు పట్టాలంటూ డ్రామాలాడుతున్నాడని ఆరోపించారు.  గృహలక్ష్మి, లక్ష రుణం, గొర్రెలు, బర్రెలు, పనిముట్లు అంటూ కొత్త నాటకాలకు కేసీఆర్ తెరలేపాడని షర్మిల చెప్పారు.  సంపద పెంచడం, ప్రజలకు పంచడం కాదు.. సంపద వెతకడం అమ్మడమే కేసీఆర్ సిద్దాంతమని వెల్లడించారు. 

ఉద్యమ తెలంగాణ .. ఉజ్వల తెలంగాణ కాలేదన్న షర్మిల.. ఉద్యమ తెలంగాణ మళ్ళీ ఉద్యమాల తెలంగాణగానే మారిందన్నారు.  కేసీఆర్ పాలన అంతమైతేనే సంక్షేమ, స్వయం సమృద్ధి తెలంగాణ సాధ్యం కాదని షర్మిల తెలిపారు.