- ఆర్వీ అసోసియేట్స్ సంస్థ ఆధ్వర్యంలో పనులు
- తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం
- సుందిళ్ల వరకు కాల్వల తవ్వకాలకు ప్లాన్
- ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ ప్రత్యేక ఫోకస్
- 20 రోజులుగా మరింత వేగంగా కొనసాగుతోన్న సర్వే
ఆసిఫాబాద్/కాగజ్ నగర్ : ప్రాణహిత ప్రాజెక్ట్ కు ప్రాణం పోసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించి.. డీపీఆర్ కోసం డ్రోన్ సర్వేకు శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పక్కన పెట్టగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్లీ చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆచరణలో చేసి చూపుతోంది.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రాజెక్ట్ నిర్మాణానికి కొత్తగా డీపీఆర్ కోసం టెండర్ పిలిచారు. ఆర్వీ అసోసి యేట్స్ సంస్థ ఒకే ఒక్క బిడ్ వేసి సర్వే పనులను దక్కించుకుంది. దీంతో తుమ్మిడిహెట్టి – ప్రాణహిత నది సంగమ ప్రాంతం నుంచి సుందిళ్ల వరకు ప్రాజెక్ట్ బ్యారేజీ నిర్మాణం, కాల్వలతో పాటు ఇతర పనులకు సంబం ధించి డ్రోన్ సర్వే కోసం నాలుగైదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పాయింట్స్ నిర్ధారించి మార్కింగ్ చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
150 మీటర్ల ఎత్తుతో డీపీఆర్ రెడీకి ప్లాన్
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై సాగునీటి ప్రాజెక్టును నిర్మించేందుకు 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 148 మీటర్ల ఎత్తుతో పనులు మొదలుపెట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక మహారాష్ట్రతో ఒప్పందాలు సైతం కుదిరాయి. అయితే ప్రాజెక్ట్ ను గత బీఆర్ఎస్ సర్కార్ పక్కన పెట్టింది. రీ డిజైన్ లో భాగంగా దీనిస్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. .. రెండేండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ను మళ్లీ తెరమీదకు తెచ్చింది.
దీనిపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టారు. గత డిసెంబర్ తొలివారం ఆర్వీ అసోసియేట్స్ సంస్థ సర్వే పనులు మొదలు పెట్టింది. ఇరిగేషన్ కాగజ్ నగర్ ఈఈ ప్రభాకర్, డీఈ వెంకటరమణతో కలిసి డీపీఆర్ తయారీ సంస్థ ప్రతినిధి ఈశ్వర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. బ్యారేజి నిర్మించే ప్రతిపాదిత ప్రాంతంలో గతంలో 148 మీటర్ల ఎత్తులో నిర్మించాలనుకోగా.. ఇప్పుడు 150 మీటర్ల ఎత్తులో బ్యారేజి నిర్మాణం చేసేలా డీపీఆర్ రెడీ చేయనున్నట్లు సంస్థ ప్రతినిధి చెబుతున్నారు.
వంద కిలోమీటర్లు.. మూడు పంప్ హౌస్ లు
గతంలో బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదించిన చోటనే ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేయనున్నట్లు సమాచారం. సుందిళ్ల వరకు జరిగే ప్రాజెక్ట్ కాల్వల నిర్మాణానికి దాదాపు 95 – 100 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే 45 – 50 కిలోమీటర్ల దూరం కాల్వల తవ్వకం పూర్తికాగా.. పని ఈజీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమికంగా రూ. 8 వేల కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రూ. 6 వేల కోట్లను కాల్వలు, పంప్ హౌస్ నిర్మాణం, అటవీ అనుమతుల చెల్లింపులకు చేయనున్నట్లు తెలుస్తోంది. 80 టీఎంసీల నీటి వినియోగం చేయనుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లో 1. 50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు.
ఇందులో సుందిళ్లతో పాటు కౌటాల మండలం కనికి చెరువును రిజర్వాయర్ గా మార్చడం తో పాటు పీపీ రావు ప్రాజెక్ట్ వద్ద సాలిగం, అచ్చలపూర్ వద్ద నీటి స్టోరేజీకి ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. గతంలో తవ్విన కాల్వలు 69 మీటర్ల వెడల్పు, ఎనిమిది మీటర్లు లోటుతో ఉన్నాయి. ఇప్పుడు కొత్త డీపీఆర్ తయారీకి డీజీపీఎస్ పాయింట్లను గుర్తిస్తుండడంతో స్థానిక రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్ట్ పనుల పురోగతిపై రివ్యూ నిర్వహించి డీపీఆర్ ను వేగంగా కంప్లీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో సర్వే సంస్థ తమ సిబ్బందిని, పరికరాలను పెంచి ఇరవై రోజులుగాసర్వేను కొనసాగిస్తుండగా.. స్థానిక రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
