నిమెసులైడ్ 100 ఎంజీ దాటితే వాడొద్దు : రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్

నిమెసులైడ్ 100 ఎంజీ దాటితే వాడొద్దు : రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
  • తయారీ, పంపిణీ, అమ్మకాలు నిషేధిస్తూ డీసీఏ నిర్ణయం
  • ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు, చట్టపరమైన చర్యలు: డీసీఏ డైరెక్టర్ జనరల్

హైదరాబాద్, వెలుగు: నొప్పి నివారణకు వాడే నిమెసులైడ్ మెడిసిన్​విషయంలో రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 100 మిల్లీగ్రాముల(ఎంజీ) కంటే ఎక్కువ మోతాదులో ఉండే నిమెసులైడ్ ఓరల్ ఫార్ములేషన్స్ (టాబ్లెట్లు, సిరప్ ఇతర రూపాలు) తయారీ, అమ్మకం, పంపిణీని తక్షణమే నిషేధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందు వల్ల మనుషుల కాలేయానికి రిస్క్ ఉందని, మార్కెట్లో ఇతర సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు రాష్ట్రంలో ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు డీసీఏ స్పష్టం చేసింది.

నిమెసులైడ్ 100 ఎంజీ కంటే ఎక్కువ మోతాదులో ఉన్న ఇమ్మీడియేట్ రిలీజ్ డోసేజ్ ఫామ్ మందులు మానవ వినియోగానికి ప్రమాదకరమని డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు నిర్ధారించింది. దీంతో డ్రగ్స్ అండ్  కాస్మొటిక్స్ యాక్ట్-1940లోని సెక్షన్ 26A ప్రకారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వీటిని నిషేధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం రాష్ట్రవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధిస్తూ సర్క్యులర్ జారీ చేశారు.

నిషేధం ఎందుకంటే..

నిమెసులైడ్ మందు వల్ల లివర్, కిడ్నీలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని డీటీఏబీ అండ్ ఐసీఎంఆర్ హెచ్చరించింది. ఈ మందు వాడడం వల్ల అకస్మాత్తుగా లివర్ ఫెయిల్యూర్ అవుతున్నట్లు గుర్తించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒక డోసులో 100 ఎంజీ కంటే ఎక్కువ మోతాదు ఉండే నిమెసులైడ్ టాబ్లెట్లు, సిరప్‌‌‌‌‌‌‌‌ ల తయారీ, విక్రయం, పంపిణీని కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిషేధించింది. ఇప్పటికే 12 ఏండ్లలోపు చిన్నపిల్లలుఈ మందును వాడకూడదని ఆంక్షలు ఉండగా.. ఇప్పుడు 100 ఎంజీ కంటే ఎక్కువ ఉన్న మందులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రజలు 100 ఎంజీ కంటే ఎక్కువ ఎంజీ మందులను మార్కెట్లో గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని డీసీఏ కోరింది. ఇప్పటికే ఆ మందును వాడుతూ ఉంటే.. వాడటం మానేయాలని సూచించింది. రాష్ట్రంలోని మెడికల్ షాపులు, హోల్‌‌‌‌‌‌‌‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, హాస్పిటల్స్ లో ఎవరైనా ఈ మందులను అమ్మినా, స్టాక్ చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీఏ హెచ్చరించింది.