దళితబంధు కాదు బీఆర్ఎస్ నేతల అనుచరుల బంధు : షర్మిల

దళితబంధు కాదు బీఆర్ఎస్ నేతల అనుచరుల బంధు : షర్మిల

దళిత బందు బీఆర్ఎస్ నేతల అనుచరుల బంధుగా మారిందన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బీఆర్ఎస్ నేతలకు, వాళ్ల అనుచరులకే దళితబంధు ఇస్తున్నారని ఆరోపించారు. ఎవరి సొమ్మని ఇష్టారాజ్యంగా పంచిపెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దళిత బంధు పథకం అమలులో అవకతవకలు జరిగాయని కేసీఆరే చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. దళితబంధులో ఎమ్మెల్యేలు రూ.3లక్షల నుంచి 5 లక్షల వరకు  తీసుకుంటున్నారని ఆరోపించారు.  కేసీఆర్ కు పాలన చేతకాదని..దిక్కుమాలిన పాలన చేస్తుండని ధ్వజమెత్తారు. 

ఇప్పటి వరకు దళితబంధు 38 వేల కుటుంబాలకు మాత్రమే ఇచ్చారన్నారు షర్మిల. రాష్ట్రం మొత్తం దళితబంధు అమలు చేయాలంటే కేసీఆర్ కు మరో 20 ఏళ్లు పడుతుందన్నారు. దళితబంధు సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలా అమలవుతుంటే..మిగతా నియోజకవర్గాల్లో  పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దళితబంధులో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోని కేసీఆర్  సీఎం కుర్చీలో  ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు.  కేసీఆర్ బందిపోట్ల రాష్ట్ర సమితి పెట్టి దేశమంతా తిరుగుతున్నాడని విమర్శించారు.