మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే తెలంగాణ వచ్చింది : షర్మిల

 మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే తెలంగాణ వచ్చింది : షర్మిల

నీళ్లు, నిధులు,నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే తెలంగాణ వచ్చిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.  లోటస్ పాండ్ లోని పార్టీ  ఆఫీసులో జరిగిన రాష్ట్ర అవిర్భావ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.  జెండా అవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల...  ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్న వేళ వైఎస్ఆర్టీపీ పుట్టిందన్నారు.  -నియామకాల కోసం మొట్టమొదటగా పోరాటం చేసి గెలిచి, నిలిచింది వైఎస్ఆర్టీపీ అని వెల్లడించారు. అన్నం మెతుకు ముట్టకుండా నిరుద్యోగ దీక్షలతో సర్కారు మెడలు వంచి నోటిఫికేషన్లు ఇప్పించింది తమ పార్టీనే అని తెలిపారు.  

 నిధులు పక్కదారి పడుతుంటే, తెలంగాణ సంపదను సీఎం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే ప్రశ్నించే గొంతుకగా వైఎస్ఆర్టీపీ నిలిచిందన్నారు షర్మిల. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో ఉద్యమం జరగాలన్నారు.   సర్కారు మారితేనే బతుకులు మారుతాయని వెల్లడించారు.  మళ్లీ వ్యవసాయం పండుగ కావాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్  లాంటి పథకాలు సక్రమంగా అమలు కావాలన్నా వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలన్నారు.   అర్హులకు పోడు పట్టాలు అందాలని, పేదలకు భూములు దక్కాలన్నారు షర్మిల. ఇందుకోసం వైఎస్ఆర్ బిడ్డ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.