
ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన అవసరమని, అలాంటి పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా తమకే ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే.. వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసి చూపిస్తానన్నారు. తెలంగాణలో ప్రజల కోసం కొట్లాడే పార్టీ లేదన్నారు. బుగ్గారం మండలం నేరేళ్ల గ్రామంలో స్థానికులతో వైఎస్ షర్మిల మాట-ముచ్చట నిర్వహించారు.సీఎం కేసీఆర్ రాష్ట్రంపై రూ.4లక్షల కోట్లు...ప్రతి ఇంటిపై రూ. 4 లక్షల అప్పు చేసి పెట్టారని, బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ అయ్యిందని, బంగారు తెలంగాణను బార్ల తెలంగాణ ...బీర్ల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ధరణి అని పేరు చెప్పి పేదవాడి భూములను లాక్కుంటున్నారని, రాష్ట్రంలో బీజేపి, కాంగ్రెస్ పార్టీలు దొంగలేనన్నారు. ఎన్నికలు ఉంటేనే ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్ బయటకు వస్తారని.. ఇప్పుడు దేశం మీద కేసీఆర్ పడ్డాడని విమర్శించారు. టీఆర్ఎస్ చాలదని.. బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశాన్ని బార్ ఆండ్ రెస్టారెంట్ చేస్తాడంట అని ఎద్దేవా చేశారు.