వైఎస్ షర్మిల అరెస్ట్..SR నగర్ లో ఉద్రిక్తత

వైఎస్ షర్మిల అరెస్ట్..SR నగర్ లో ఉద్రిక్తత

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో వెళ్తున్న ఆమెను  పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  షర్మిల కార్లో ఉండగానే క్రేన్ సహాయంతో ఆమె కారును ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు లాక్కెళ్లారు. డమ్మీ తాళాలతో కారు డోర్ లాక్ ఓపెన్ చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి.. పీఎస్ కు తరలించారు. పోలీసుల వైఖరిపై వైఎస్సార్ టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యకర్తలు బిల్డింగ్ ఎక్కి నిరసన చేస్తున్నారు.

రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నది నాయకులు కార్యకర్తలు కాదు.. గూండాలని అన్నారు. ఉద్యమకారుల్ని పార్టీ నుంచి వెళ్లగొట్టి గూండాల పార్టీలా మార్చారని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని మండిపడ్డారు. పోలీసులు కూడా గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. లేని సమస్యను సృష్టించి తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తనవల్ల ట్రాఫిక్ జాం కాలేదన్న ఆమె.. టీఆర్ఎస్ కార్యకర్తలు తగులబెట్టిన బస్సు కేసీఆర్ చూడాలనే దాన్ని ప్రగతి భవన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశామని చెప్పారు. పోలీసు వాహనాల వల్ల ట్రాఫిక్ జాం అయిందే తప్ప తమ వల్ల కాదని స్పష్టం చేశారు. ప్రజలపక్షాన పోరాడుతున్నందునే అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొచ్చారని షర్మిల మండిపడ్డారు.

పాదయాత్ర చేస్తున్న తనను ఎందుకు అరెస్ట్ చేశారని షర్మిల ప్రశ్నించారు. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన వాహనానికి నిప్పు పెట్టి, మరికొన్నింటి అద్దాలు పగలగొట్టిన దుండగుల్ని వదిలేసి తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని షర్మిల నిలదీశారు. తనపై గూండాల్లా దాడి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించరా అని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వదిలి పెట్టి తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.