బెంగళూరులో వైఎస్ షర్మిల.. డీకేతో మళ్లీ భేటీ

బెంగళూరులో వైఎస్ షర్మిల.. డీకేతో మళ్లీ భేటీ

బెంగళూర్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. సోమవారం (మే 29న) ఉదయం బెంగళూరులోని డీకే నివాసంలో ఆయనతో భేటీ అయ్యి..శుభాకాంక్షలు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ డీకేకు కితాబునిచ్చారు. మహానేత YSR తో ఉన్న సాన్నిహిత్యాన్ని డీకే శివకుమార్.. వైఎస్ షర్మిల వద్ద గుర్తు చేశారు. మరోవైపు.. వైఎస్ షర్మిల మే 15వ తేదీన డీకే శివకుమార్ బర్త్ డే రోజు కూడా భేటీ అయ్యి.. శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ భేటీ తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ టీపీ మధ్య పొత్తు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో డీకే శివకుమార్ ను షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో వారి మధ్య రాజకీయ పరమైన చర్చలు జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో కొంతకాలంగా వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య  పొత్తు ఉండొచ్చని జరుగుతున్న ప్రచారానికి.. ఈ భేటీ మరింత ఊతం ఇస్తోంది. మరోవైపు... రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.