2 వేల 500 ట్రాక్టర్లు రైతులకు పంపిణీ చేసిన సీఎం జగన్

2 వేల 500 ట్రాక్టర్లు రైతులకు పంపిణీ చేసిన సీఎం జగన్

రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా అన్నదాతలకు ఎలాంటి మంచి జరిగితే బాగుంటుందో, వారిని ఏ విధంగా ఆదుకోవాలో తనకు తెలుసునని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు నగరంలోని చుట్టుగుంట దగ్గర ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్ల మెగా పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత సీఎం జగన్‌ ఆర్బీకేల పరిధిలో రైతులకు అందజేయనున్న ట్రాక్టర్లను, హార్వెస్టర్లను పరిశీలించారు. అనంతరం హార్వెస్టర్‌, ట్రాక్టర్‌ను జగన్‌ కొంతదూరం నడిపి రైతుల్లో జోష్‌ నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతన్నలు బాగుండాలన్న ఉద్దేశంతో.. వారికి అవసరమైన వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, కంబైన్ట్‌ హార్వెస్టర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు అందజేస్తున్న ఈ పరికరాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని రైతులు వారికి కావాల్సిన సమయంలో వినియోగించుకోవచ్చని సీఎం చెప్పారు. 

తక్కువ ధరకే పరికరాలు అందుబాటులోకి..

ప్రతి ఆర్బీకే ప‌రిధిలో ఒక క‌ష్టమ్ హైరింగ్ సెంట‌ర్ కింద రైతుల‌కు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవ‌సాయ ప‌రిక‌రాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు జగన్‌ తెలిపారు. ఆర్బీకే ప‌రిధిలోని రైతులు అంద‌రూ ఒక గ్రూపుగా ఏర్పడి.. వాళ్లు ఒక క‌మ్యూనిటీ హైరింగ్ సెంట‌ర్ కింద‌కు వ‌చ్చి.. త‌క్కువ ధ‌ర‌కే వ్యవసాయ యంత్రాలు, పరికరాలను పొందవచ్చన్నారు. దీని వల్ల గ్రామంలోని రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నేటి కార్యక్రమంతో రాష్ట్రంలోని మొత్తం 10, 444 ఆర్బీకేల ప‌రిధిలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, వ్యవసాయ పరికరాలు సమకూరినట్లు స్పష్టం చేశారు. గతంలో 6225 ఆర్బీకేలకు యంత్రాలను అందజేశామని.. ఇవాళ మిగిలిన 3919 ఆర్బీకేల పరిధిలో 100 క్లస్టర్స్ స్థాయిలో దాదాపు 2562 క‌మ్యూనిటీ హైరింగ్ సెంట‌ర్ల కింద ఈ యంత్ర సామగ్రిని అందుబాటులో ఉండనుందన్నారు సీఎం. 

వరి బాగా పండే ప్రాంతాలపై దృష్టి..

రాష్ట్రంలో వరి అధికంగా పండే ప్రాంతాలను గుర్తించి.. అక్కడ కావాల్సిన యంత్ర పరికరాలు అందిస్తున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో వరి అధికంగా పండించే 491 క్లస్టర్లను గుర్తించి.. అక్కడ 491 కంబైన్డ్ హార్వెస్టర్లను తీసుకొచ్చామన్నారు. ఒక్కో హార్వస్టర్‌ ఖర్చు 25 లక్షల‌ వరకు ఉంటుందన్నారు. 361 కోట్లతో 2562 ట్రాక్టర్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీంతోపాటు.. 13,573 వ్యవసాయ ప‌నిముట్లు అందుబాటులో ఉండేలా చ‌ర్యలు తీసుకున్నామన్నారు. యంత్ర సామాగ్రి పంపిణీకి దాదాపు 1052 కోట్లను ఏటా ఖర్చు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఆర్బీకేకి 15 ల‌క్షలు చొప్పున కేటాయించి.. అక్కడ ఎలాంటి యంత్రాలు కావాల‌ని రైతుల నుంచి అభిప్రాయాలు సేక‌రించి.. ప్రతి ఆర్బేకే ప‌రిధిలో ఆయా యాంత్రాల‌ను స‌మకూర్చుతున్నట్లు సీఎం తెలిపారు. 

ఆన్‌లైన్‌లోనే కావాల్సిన యంత్రాన్ని బుక్‌ చేసుకోవచ్చు..

వ్యవసాయ యంత్రాలు, పరికరాలను ఆర్బీకేల పరిధిలోని రైతులు ప‌ది శాతం చెల్లించి వాటిని పొందవచ్చని.. మిగిలిన 40 శాతం ప్రభుత్వం రాయితీ కల్పిస్తోందని సీఎం జగన్‌ తెలిపారు. ఇక మిగిలిన 50 శాతం రుణసదుపాయాన్ని ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. ఇక వాహనం కొనుగోలు చేయలేని వారు.. తక్కువ అద్దె చెల్లించి.. వాహనాన్ని రైతు నుంచి వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీని కోసం వైఎస్సార్ యంత్ర సేవా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 15 రోజుల ముందే బుక్‌ చేసుకుంటే.. సేవ‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. 

అక్టోబర్‌లో మరో గొప్ప కార్యక్రమం..

యంత్ర సేవా పథకం కార్యక్రమంలో భాగంగా.. రైతులకు సీఎం జగన్‌ మరో శుభవార్త చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌లో రైతులకు మరో విడతలో వ్యవసాయ పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా విడిపరికరాలు అయిన స్ప్రేయర్లు వంటి పరికరాలను అందిస్తామన్నారు. ఏడు ల‌క్షల మందికి ల‌బ్ది చేకూర్చేలా వ్యక్తిగ‌త వ్యవ‌సాయ ప‌నిముట్లు అక్టోబర్‌లో అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్‌ బ‌ట‌న్ నొక్కి.. జెండా ఊపి.. వ్యవ‌సాయ యంత్రాలు, ప‌రిక‌రాల‌ను రైతుల‌కు అంద‌జేశారు.