ఇచ్చిన హామీలు నెరవేర్చి..కేసీఆర్ దేశం గురించి మాట్లాడాలె:షర్మిల

ఇచ్చిన హామీలు నెరవేర్చి..కేసీఆర్ దేశం గురించి మాట్లాడాలె:షర్మిల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం కేసీఆర్ అమలు చేశారా అని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. మహోజ్వల భారత్ కాదు..ముందు మహోజ్వల తెలంగాణ అయిందా అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాత మహోజ్వల భారత్ గురించి మాట్లాడాలని మంగళవారం ఒక ప్రకటనలో ఫైర్ అయ్యారు. రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల  భూమి, పోడు పట్టాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంటి హామీలు ఏమయ్యాయని షర్మిల నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు గోస పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్-ది ఉజ్వల పాలన కాదని.. అవినీతి, అక్రమ , దౌర్జన్యాలు, నిర్బంధాలు, అరెస్టులు, గూండాల పాలన​అని షర్మిల విమర్శించారు. 

తెలంగాణలో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదుగాని.. వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడతాడట అని ఆమె ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలోని ఒక్క ఊరిలో కనీసం ఇద్దరికి కూడా దళితబంధు ఇవ్వలేదుగాని.. దేశంలో 25లక్షల మందికి దళితబంధు అందజేస్తామని హామీ ఇస్తున్నరని మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా ఎన్నికల్లో ఓట్ల కోసమేనని తెలిపారు. మునుగోడులో వేల కోట్లు ఖర్చు చేస్తమని హామీ ఇచ్చి నెరవేర్చలేదని గుర్తుచేశారు. పట్టపగలు రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటుండని షర్మిల మండిపడ్డారు.