ఒక్క మాటా నిలబెట్టుకోలె

ఒక్క మాటా నిలబెట్టుకోలె

కేసీఆర్‌‌ కోట్లు కొల్లగొట్టి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండు: షర్మిల

కోరుట్ల, వెలుగు: ప్రజలకు ఇచ్చిన ఒక్క మాటా నిలబెట్టుకోలేని చేతకాని సీఎం కేసీఆర్ అని వైఎస్సార్‌‌టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి, రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారన్నారు. అప్పట్లో స్కూటర్‌‌పై తిరిగే కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ ఖజానాను కొల్లగొట్టారని ఫైర్‌‌ అయ్యారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్లలో పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రం వచ్చాక ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందన్నారు. కేసీఆర్ కోరుట్లకు చేసింది ఏమీ లేదన్నారు. వైఎస్సార్ టైమ్‌లోనే పసుపు పచ్చ బంగారం అయ్యిందని, మద్దతు ధర రూ.22 వేలు పలికితే, ఇప్పుడు రూ.5 వేలు కూడా లేదన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌‌రావు కొడుకు సంజయ్ షాడో ఎమ్మెల్యేగా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు షుగర్‌‌ ఫ్యాక్టరీ తెరిపించకపోతే ఆ గేట్‌కి ఉరి వేసుకుంటా అని చెప్పి మాట తప్పారన్నారు. భూ కబ్జాలు, కమీషన్లు,సెటిల్‌మెంట్లు చేశారని, ఖాదీ బోర్డ్ భూములను కాజేశారని ఆరోపించారు. రెండు గ్రామాలను దత్తత తీసుకొని అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు.

సీబీఐ అంటే ఎందుకంత భయం..

మునుగోడులో ఓట్ల కోసం సింపతీ అనే సినిమాని కేసీఆర్ స్టార్ట్ చేశారని, ఇది సస్పెన్స్ థ్రిల్లర్‌‌లా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూసిందంటూ రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారని, ప్రెస్‌మీట్ పెట్టి మొత్తం బయట పెడతానని చెప్పిన కేసీఆర్ అది కూడా చేయలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై బీజేపీ వాళ్లు కోర్టుకెళ్తే, సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదన్న రహస్య జీవో బయటకు వచ్చిందన్నారు. ఇలాంటి జీవోలు ఇంకా ఎన్ని ఉన్నాయో అని ప్రశ్నించారు. అసలు కేసీఆర్‌‌కి సీబీఐ అంటే ఎందుకు భయమని, కేంద్ర సంస్థకు భయపడుతున్నారంటే దొంగ అని ఒప్పుకున్నట్లే కదా అని అన్నారు. ఇన్నేండ్లు బీజేపీకి, టీఆర్‌‌ఎస్‌కి మునుగోడు కనపడలేదా అని, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి, ఎవరికి వాళ్లు ప్రత్యేక మేనిఫెస్టో పెట్టారని 
దుయ్యబట్టారు. 

పార్టీ కమిటీలను ఏర్పాటు చేయండి 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బూత్, గ్రామ, మండల, డివిజన్, మున్సిపాలిటీల వారీగా పార్టీ కమిటీలు మంగళవారం కల్లా పూర్తి చేయాలని వైఎస్ ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆదేశించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పార్టీ పరిశీలకులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లను షర్మిల ఆదేశించారు. ప్రతి కమిటీలో 10 మంది ఉండాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అనుబంధ విభాగాల (మహిళ, యూత్, విద్యార్థి) కమిటీల ఏర్పాటులో జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులకు సహకరించాలని షర్మిల ఆదేశించారు.