అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తం

అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తం

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్​టీపీ అధినేత్రి షర్మిల వెల్లడించారు. పార్టీ పెట్టిన ఏడాదిలోనే ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేశామని తెలిపారు. జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర దీక్షతో పాటు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరామర్శ, ఫీల్డ్ అసిస్టెంట్లు, దళితులు, బీసీల కోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. తాను చేస్తున్న పాదయాత్రలో ప్రజలు వారి సమస్యలు చెప్పుకుంటున్నారని, ఉత్తర తెలంగాణలో కూడా పాదయాత్ర చేపట్టనున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్​రాజశేఖర్​రెడ్డికి నివాళి అర్పించడానికి హైదరాబాద్ లో మెమోరియల్ లేదని, రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాలన్నారు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో ఐమాక్స్ పక్కన 20 ఎకరాలు మెమోరియల్ కు కేటాయించినట్లు గుర్తు చేశారు. వైఎస్​ కేబినెట్ లో పనిచేసి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారు ఆయన మెమోరియల్ కోసం చొరవ చూపలేదన్నారు. శుక్రవారం లోటస్ పాండ్​లో షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఏం ఇవ్వలేదని, చనిపోయిన తరువాత ఆయన పేరును ఎఫ్ఐఆర్​లో చేర్చారని షర్మిల మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​కు వైఎస్సార్ ల్యాండ్ ఇచ్చారని, తెలంగాణ కోసం 40 మంది ఎమ్మెల్యేలతో లేఖను ఏఐసీసీకి పంపారని ఆమె గుర్తు చేశారు. వైఎస్ చొరవతోనే కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారని, హరీశ్​మంత్రి అయ్యారన్నారు. ఆరోగ్య శ్రీ గొప్ప స్కీమ్ అని కేసీఆర్ అసెంబ్లీలో పొగిడారని ఆమె గుర్తు చేశారు. 

మీడియాతో చిట్ చాట్

ప్రెస్ మీట్ తర్వాత షర్మిల మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మను నియమిస్తారా?,  ఇడుపులపాయలో జగన్​తో కలిసి నివాళులు అర్పించటంతో మీకు వైఎస్ జగన్ కు మధ్య విభేదాలు తొలగిపోయినట్లేనా? అన్న ప్రశ్నలకు షర్మిల స్పందించలేదు. “బీఆర్ఎస్ అనేది తుగ్లక్ ఆలోచన. రాష్ట్రంలో ఏం చేసిండని దేశ రాజకీయాలకు వెళతుండు. స్టేట్​లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలే లేవు. అన్ని సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తం. ఎన్నికలకు 6 నెలల ముందు అన్ని సమీకరణాలు మారుతాయి” అని అన్నారు.  కేసీఆర్ ఓటమి కోసం అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడితే కలుస్తరా? అన్న ప్రశ్నకు ఎవరితో కలవబోయేది లేదని స్పష్టం చేశారు. 

వైఎస్సార్​కు నివాళులు

వైఎస్సార్ 73వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్ షర్మిల విజయమ్మ, సీఎం జగన్ తో కలిసి నివాళులు అర్పించి, సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం హైదరాబాద్ లోని పంజాగుట్టలో వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తరువాత పార్టీ కేంద్ర కార్యాలయంలో లోటస్ పాండ్ లో పార్టీ జెండా ఎగురవేసి, అనాథలకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.