సైదిరెడ్డి ఓ కక్కుర్తి ఎమ్మెల్యే

సైదిరెడ్డి ఓ కక్కుర్తి ఎమ్మెల్యే

హుజుర్ నగర్: వరి వద్దన్న సన్నాసి... సీఎం కేసీఆర్ అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా హుజుర్ నగర్ నియోజక వర్గంలో షర్మిల పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... పేదోళ్లకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో నాటి సీఎం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే... ఇవాళ ఆ పథకాన్ని సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో ప్రతి గ్రామానికి రూ.25 లక్షలు, మండలానికి రూ. 30 లక్షలు, హుజుర్ నగర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు ఇస్తానన్న కేసీఆర్... ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత్  చారి తల్లి శంకరమ్మకు ఓడిపోయే స్థానంలో టికెట్ ఇచ్చారని చెప్పారు. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తన కూతురు కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్... శంకరమ్మపై ఎందుకు వివక్ష చూపారని విమర్శించారు. 

సైదిరెడ్డి లాంటి కక్కుర్తి ఎమ్మెల్యేను ఎక్కడా చూడలేదని షర్మిల చెప్పారు. మట్టి, ఇసుక, రేషన్ బియ్యం మొదలు డ్రైనేజీ పైపుల వరకు అన్ని దందాలు చేస్తూ... ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ లో నేతలెలా ఉన్నారో ఉంటే క్యాడర్ కూడా అలాగే ఉందన్నారు. హైదరాబాద్ కు వచ్చిన మోడీని రాష్ట్ర సమస్యలపై ఎందుకు నిలదీయలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ధాన్యం కొనుగోలు, పసుపు బోర్డు వంటి హామీల గురించి ఎందుకు మాట్లాడలేదని మోడీపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని మోడీ... ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వచ్చారని ఫైర్ అయ్యారు. ప్లెక్సీల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలాడాయని, యాడ్స్ పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేశాయని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో స్పష్టమైన ఆధారాలున్నా రేవంత్ రెడ్డిని ఎందుకు జైల్లో వేయలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు.