- లేదంటే మే దాకా ఆగాల్సిందే.. మధ్యలో ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్
- వీలైనంత తొందరగా ఎలక్షన్స్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు
- గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో నిర్వహించేందుకు రెడీ
- సంక్రాంతి కల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు
- ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు
- మార్చి 31కల్లా కొత్త పాలకవర్గాలు ఏర్పడకపోతే రూ.900 కోట్ల గ్రాంట్లు వెనక్కి వెళ్లే ప్రమాదం
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. అయితే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపైనే ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉన్నది.
ప్రభుత్వం జనవరి 20 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేస్తే.. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ ఏమాత్రం ఆలస్యమైనా ఇంటర్, టెన్త్ పరీక్షల కారణంగా మళ్లీ మే వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మార్చి నెలాఖరు కల్లా మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కాకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు కూడా చేజారిపోతాయని సర్కార్ ఆందోళన చెందుతున్నది.
ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా మున్సిపల్ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ ఇచ్చిందని తెలుస్తున్నది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై ఎస్‌ఈసీ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. పోలింగ్‌కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, ఓటర్ల జాబితా తయారీపై మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రకారమే రిజర్వేషన్లు..
మున్సిపల్ఎన్నికల్లోనూ వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. కోర్టు తీర్పు ప్రకారం.. ఈ రిజర్వేషన్లను కూడా డెడికేటెడ్కమిషన్రిపోర్ట్ ప్రకారమే ఫైనల్చేయాల్సి ఉంటుంది. వచ్చే నెలలో వీటికి సంబంధించిన రిజర్వేషన్ల నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరనున్నట్టు తెలిసింది. ఆ వెంటనే ఆ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది.
అనంతరం ఆ నివేదికను మున్సిపల్ శాఖ ఆయా మున్సిపాలిటీలకు పంపి, రిజర్వేషన్ల జాబితాను ఫైనల్చేస్తుంది. ఆ తర్వాతే తుది రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వం గెజిట్రూపంలో ప్రచురించి, ఎన్నికల సంఘానికి అందిస్తుంది. అప్పుడే ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ మొత్తం జనవరి 20కల్లా పూర్తి చేస్తేనే, ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.
మున్సిపల్చట్టం ప్రకారం షెడ్యూల్రిలీజ్చేసి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లోనే పోలింగ్ పూర్తవుతుంది. ఒకవేళ రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, మధ్యలో 5 రోజుల గ్యాప్‌తో పూర్తి చేస్తారు. ఇదంతా సజావుగా జరిగితే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు పూర్తవుతాయి. కానీ ఒకవేళ ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఎదురైనా, లేదా పరిపాలనాపరమైన జాప్యం జరిగినా పరిస్థితి మారుతుంది. ఫిబ్రవరి 15లోపు ఎన్నికలు నిర్వహించకపోతే.. ఆ తర్వాత ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ అడ్డు వస్తాయి.
దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు మళ్లీ మేలోనే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సంక్రాంతిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత షెడ్యూల్వస్తే ఎలక్షన్కోడ్అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందునే సర్కార్ నుంచి ఆర్డర్స్వచ్చాయని, జనవరిలోనే మున్సిపల్ఎన్నికలకు షెడ్యూల్వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఆలస్యమైతే నిధులు అటే..
15వ ఆర్థిక సంఘం నిధులను కాపాడుకునేందుకే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు లేని కారణంగా అర్బన్స్థానిక సంస్థలకు రావాల్సిన దాదాపు రూ.1,400 కోట్ల గ్రాంట్లు కేంద్రం వద్దే హోల్డ్‌లో ఉన్నాయి. మార్చి 31లోగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరకపోతే, ఆ నిధులన్నీ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. పట్టణాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు అత్యంత అవసరమైన ఈ భారీ మొత్తాన్ని కాపాడుకోవాలంటే మార్చి లోపు ఎన్నికల ప్రక్రియను ముగించడం అనివార్యమని ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదించింది.
‘‘పంచాయతీలకు సంబంధించిన గ్రాంట్ల మాదిరిగానే మున్సిపల్గ్రాంట్లు కూడా నిలిచిపోయాయి. సర్పంచ్ ఎన్నికలు పూర్తయినందున వాటికి లైన్‌క్లియర్ అయింది. ఇప్పుడు మున్సిపల్ఎన్నికలు పూర్తి చేస్తే.. ఆ నిధులు కూడా వస్తాయి. దీంతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది” అని ఆర్థిక శాఖ పేర్కొంది.
ఎలక్షన్ కమిషనర్ రివ్యూ..
ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ, ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను మార్చడం, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయడంపై దృష్టిసారించారు. అలాగే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను తయారు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను ఎస్‌ఈసీ దృష్టికి మున్సిపల్ కమిషనర్లు తీసుకెళ్లారు. ఎన్నికల సామగ్రి సేకరణ, పోలింగ్ సిబ్బంది నియామకం వంటి అంశాలపై కమిషనర్ ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
