పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర ! ఒక్కో స్కీమ్‌ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్

పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర ! ఒక్కో స్కీమ్‌ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్
  • ఉపాధి హామీలో 90 నుంచి 60 శాతానికి కేంద్రం వాటా కుదింపు
  • నేషనల్ ​హెల్త్​ మిషన్‌లో 75 నుంచి 40 శాతానికి..
  • గ్రామీణ సడక్ ​యోజనలోనూ ఇదే సీన్​..
  • పేదల ఇండ్లకు రూరల్‌లో రూ.72 వేలు, అర్బన్‌లో రూ.1.5 లక్షలే 
  • మిగిలిన మొత్తం రాష్ట్ర సర్కార్ భరించాల్సిందే 
  • అంగన్‌వాడీ, సర్వశిక్ష అభియాన్‌కూ అరకొర ఫండ్స్
  • వరదలు, కరువు నిధుల్లోనూ కొర్రీలు, కోతలు 
  • పథకాల అమల్లో కఠిన నిబంధనలు
  • కేంద్రం తీరుతో రాష్ట్రంపై ఏటా వేల కోట్ల అదనపు భారం

హైదరాబాద్, వెలుగు: కీలక పథకాల అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటున్నది. రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తన వాటా నిధులకు భారీగా కోతలు పెట్టడం, నిబంధనల పేరుతో మొత్తం పథకాలనే పక్కనపెట్టడం లాంటి చర్యలకు పూనుకుంటున్నది.

గతంలో కొన్ని పథకాలకు ఉదారంగా నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఇప్పుడు ప్రతి రూపాయికీ లెక్కలు అడుగుతూ, కఠిన నిబంధనలతో రాష్ట్రాల చేతులు కట్టేస్తున్నది. ఫలితంగా ఆయా పథకాల నిర్వహణ భారమంతా రాష్ట్ర ప్రభుత్వాల పైనే  పడ్తున్నది.

పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో గతంలో 90:10 లేదంటే 75:25 నిష్పత్తిలో ఉన్న కేంద్ర, రాష్ట్రాల వాటాను.. ఇప్పుడు ఏకంగా 60:40 నిష్పత్తికి కేంద్రం మార్చేసింది. అంతేకాదు ఆయా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రం తొలుత అప్పుసప్పు చేసి తన వాటా నిధులను చెల్లిస్తేనే.. ఆ తర్వాత కేంద్రం తాపీగా నిధులు ఇచ్చేలా రూల్స్ ​మార్చింది.

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను, స్థానిక అవసరాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో పథకాల స్వరూపాన్ని మార్చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తీరు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో రాష్ట్రానికి దాదాపు రూ.3 వేల కోట్ల దాకా కోత పడే అవకాశం ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఉపాధి నిధుల్లో భారీ కోత.. 
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్‌‌‌‌ భారత్‌‌‌‌ గ్యారెంటీ ఫర్‌‌‌‌ రోజ్‌‌‌‌గార్‌‌‌‌ అండ్‌‌‌‌ అజీవికా మిషన్‌‌‌‌’ (వీబీ-జీరామ్‌‌‌‌-జీ)గా మార్చిన కేంద్ర ప్రభుత్వం.. కేవలం పేరులోనే కాదు, పథకంలోనూ సమూల మార్పులు చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 90 శాతం చెల్లిస్తే.. రాష్ట్రాలు కేవలం 10 శాతం దాకా భరించేవి. 

కూలీల వేతనాలు 100%, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు 100% పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చెల్లించేది. కేవలం మెటీరియల్ ఖర్చులో మాత్రమే రాష్ట్రం 25%  పెట్టుకునేది. కానీ కొత్తగా తెచ్చిన ‘వీబీ-జీ రామ్​జీ’  స్కీం కింద వేతనాలు, మెటీరియల్, అడ్మినిస్ట్రేషన్ అనే తేడా లేకుండా మొత్తం ఖర్చులో కేంద్రం, రాష్ట్ర వాటా 60:40 నిష్పత్తిలో భరించాలని స్పష్టం చేసింది.

కేంద్రం తెచ్చిన ఈ కొత్త విధానంతో రాష్ట్రానికి ఏటా రూ.1,300 కోట్ల దాకా భారం పడనుందని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. నిజానికి ఏటా ఉపాధి హామీ పథకం కేటాయింపులను కేంద్రం తగ్గిస్తూ పోతున్నది.

కరోనా సమయంలో (2020-22) రాష్ట్రానికి ఏటా రూ.4,100 కోట్లకు పైగా నిధులు రాగా, ఆ తర్వాతి కాలంలో ఇది రూ.2 వేల కోట్లకు పడిపోయింది. ఉపాధి నిధులను సరిగ్గా వినియోగించడం లేదని, పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ.. ఇలా రకరకాల సాకులతో కేంద్రం నిధులు నిలిపివేయడం రాష్ట్రానికి శాపంగా మారింది.

ఆరోగ్య మిషన్‌‌‌‌లోనూ అంతే.. 
జాతీయ ఆరోగ్య మిషన్ అమలులోనూ కేంద్రం తీరు రాష్ట్రానికి శాపంగా మారింది. మొదట్లో ఈ పథకంలో కేంద్రం, రాష్ట్రాల నిధుల వాటా 75:25 ఉండగా, ప్రస్తుతం 60:40కి మార్చారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం కింద కేంద్రం నుంచి రూ. 985.34 కోట్లు విడుదల కావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 176.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.

ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌‌‌‌నెస్ సెంటర్లకు సంబంధించిన బ్రాండింగ్, లోగోల విషయంలో కేంద్రం విధించిన నిబంధనలను రాష్ట్రం పాటించలేదనే సాకుతో వందల కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసింది. దీంతో ఆసుపత్రుల నిర్వహణ, సిబ్బంది వేతనాల భారమంతా రాష్ట్రంపైనే పడ్తున్నది. వాస్తవానికి ప్రజారోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు కేంద్రం సూచించిన రంగులే వేయాలని, వాటికి ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ అనే పేరు పెట్టాలని కేంద్రం హుకుం జారీ చేసింది. 

అంగన్‌‌‌‌వాడీల భారమంతా రాష్ట్రం పైనే.. 
అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల (ఐసీడీఎస్) నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒకప్పుడు ఈ పథకానికి వెన్నుదన్నుగా నిలిచిన కేంద్రం.. ఇప్పుడు నామమాత్రపు నిధులతో మమ అనిపిస్తోంది. పథకం పేరు 'కేంద్ర ప్రాయోజితం'అయినప్పటికీ, వాస్తవ భారం రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడ్తోంది. గతంలో 90 శాతం నిధులను కేంద్రమే భరించగా, ఇప్పుడు ఆ వాటాను 60 శాతానికి తగ్గించుకుంది. 

కేంద్రం దృష్టిలో ఒక అంగన్‌‌‌‌వాడీ టీచర్ జీతం కేవలం రూ.4,500 మాత్రమే. ఇందులో తమ వాటాగా 60 శాతం అంటే రూ.2,700 మాత్రమే కేంద్రం ఇస్తుంది. అంగన్‌‌‌‌వాడీ హెల్పర్‌‌‌‌కు కేంద్రం నిర్ణయించిన జీతం రూ.2,250. ఇందులో కేంద్రం ఇచ్చేది రూ.1,350. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌‌‌‌వాడీ టీచర్లకు ప్రస్తుతం ప్రతి నెలా రూ.13,650 వేతనం ఇస్తోంది. మొత్తం రూ.13,650లో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.2,700 మాత్రమే. 

మిగిలిన రూ.10,950 ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానా నుంచి చెల్లిస్తోంది. అంటే టీచర్ల జీతాల్లో కేంద్రం వాటా 20 శాతం కూడా లేదు. ఇక విద్యా రంగానికి సంబంధించి సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ వంటి పథకాల్లోనూ కేంద్రం కోతలు విధిస్తోంది. గతంలో ఆదర్శ పాఠశాలల  నిర్వహణను కేంద్రమే చూసుకునేది. కానీ 2016 నుంచి కేంద్రం ఈ బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకోవడంతో, రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్ల నిర్వహణ, టీచర్ల జీతాల భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది.

 అలాగే సర్వశిక్షా అభియాన్ కింద నిధులు పొందాలంటే రాష్ట్రం తన 40 శాతం వాటాను సకాలంలో జమ చేయాలనే నిబంధన ఉంది. దీనివల్ల ఏటా రూ.600 నుంచి రూ.800 కోట్ల మేర రావాల్సిన నిధులు తరచూ నిలిచిపోతున్నాయి. మధ్యాహ్న భోజన పథకం నిధుల వాటాను కూడా 75:25 నుంచి 60:40కి తగ్గించడంతో రాష్ట్రంపై అదనపు భారం పడ్తోంది.

గ్రామీణ సడక్ యోజనలోనూ వాటా కుదింపు..
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యా రంగాలకు సంబంధించిన కీలక పథకాల్లో కేంద్రం కోతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన’ కింద రోడ్ల నిర్మాణానికి 90 శాతం నుంచి 100 శాతం నిధులను కేంద్రమే భరించేది. తాజా నిబంధనల ప్రకారం దీనిని 60:40 నిష్పత్తికి కుదించారు. 

అలాగే వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన ‘గ్రీన్ రివల్యూషన్ కృషోన్నతి యోజన’లో గతంలో 100 శాతం నిధులు కేంద్రమే ఇచ్చేది, ఇప్పుడది 60 శాతానికి పడిపోయింది. ‘పీఎం ఫసల్ బీమా యోజన’లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో 50:50గా ఉన్న నిష్పత్తిని మార్చి, ఇప్పుడు కేవలం 25 శాతం మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పింది.

వరదలు వచ్చినా ఆదుకుంటలే..
వరదలు, కరువు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ నిధులిచ్చి రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. ఎస్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్, ఎన్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్ నిధుల విడుదలలో రాజకీయ కోణంలో వ్యవహరిస్తూ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మొండిచేయి చూపుతోంది.  

ఆ స్కీమ్స్ భారమంతా రాష్ట్రం పైనే..
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్రం నిలిపివేసింది. తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాలకు ఏటా రూ. 450 కోట్ల చొప్పున కేంద్రం నిధులు ఇవ్వాలి. 2015-16 తర్వాత ఈ స్కీమ్‌‌‌‌ను కేంద్రం రద్దు చేసింది. దీని వల్ల రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.2 వేల కోట్ల బకాయిలు నిలిచిపోయాయి. 

దీనికి తోడు నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్లాన్, పోలీసుల ఆధునీకరణ, ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్ వంటి కేంద్ర ప్రాయోజిత పథకాలను  కేంద్రం పక్కన పెట్టేసింది. వీటి నిర్వహణకు గతంలో కేంద్రం నుంచి నిధులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పథకాలను కొనసాగించాలంటే రాష్ట్రమే సొంత నిధులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పేదల ఇండ్ల స్కీములోనూ..
పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (-గ్రామీణ/అర్బన్) కింద కేంద్రం ఇస్తున్న సాయం.. ప్రస్తుత మార్కెట్ ధరలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. సిమెంట్, ఇసుక, ఇనుము ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. కేంద్రం ఇచ్చే యూనిట్ కాస్ట్ (అర్బన్‌‌‌‌లో రూ.1.5 లక్షలు, రూరల్‌‌‌‌లో రూ.72వేలు) పెంచకపోవడంతో, ఇళ్లు పూర్తికాక లబ్ధిదారులు పనులను అర్ధంతరంగా నిలిపివేస్తున్నారు.

ఒక ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి కనీసం రూ.5 లక్షల వరకు ఖర్చవుతుండగా, మిగిలిన భారాన్ని పేద లబ్ధిదారులపై వేయలేక, రాష్ట్ర ప్రభుత్వమే అదనపు నిధులను భరిస్తున్నది. పేరు మాత్రం ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కానీ అందులో 80 శాతం  నిధులు రాష్ట్ర సర్కారువేనని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రూరల్‌‌‌‌లో ఒక్క ఇంటినీ మంజూరు చేయని కేంద్రం.. అర్బన్‌‌‌‌లో 1.13లక్షల ఇండ్లను మంజూరు చేసింది. అంటే రూ.1,695 కోట్లు కేంద్రం ఇస్తే, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.4వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నది. 

లెక్కల్లో భారీ అంతరం..
మొత్తంగా చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు  క్రమంగా పడిపోతున్నాయి. ఒక్క సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్​ను చూస్తేనే  2022-23లో రూ.25,830 కోట్లు ఉండగా, అది 2024-25 నాటికి సుమారు రూ.17,595 కోట్లకు తగ్గింది.అదే సమయంలో కేంద్ర ప్రాయోజిత పథకాల వాటా 60:40కి మారడంతో రాష్ట్రం తన వాటా కింద ఏటా అదనంగా రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్లు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. 

ఇది రాష్ట్ర అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్రం విధిస్తున్న ఈ ఆర్థిక ఆంక్షలు, నిధుల కోతలు రాష్ట్ర ప్రగతికి సంకెళ్లుగా మారుతు న్నాయి. ఫెడరలిజం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ విధానాలను మార్చాలని రాష్ట్రం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం అటుంచితే మొత్తం పథకాల తీరునే మార్చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.