మంత్రి శ్రీనివాస్​గౌడ్​ సొంతూరు రాచాలకు రోడ్డు కూడా లేదు

మంత్రి శ్రీనివాస్​గౌడ్​ సొంతూరు రాచాలకు  రోడ్డు కూడా లేదు

దేవరకద్ర/అడ్డాకుల, వెలుగు : టీఆర్ఎస్​ మంత్రులకు సంపాదన మీద ఉన్న ప్రేమ సొంతూళ్ల అభివృద్ధిపై లేదని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు  షర్మిల అన్నారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ సొంతూరు రాచాల గ్రామానికి  రోడ్డు కూడా లేదని, మంత్రి అయ్యాక ఆయన తన సొంతూరినే మరిచిపోయారని ఆమె విమర్శించారు. ఆమె చేపట్టిన పాదయాత్ర మంగళవారం నాటికి 150  రోజులకు చేరుకుంది. యాత్ర ఉదయం మహబూబ్ నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కురుమూర్తి మీదుగా దేవరకద్ర మండలంలోని వెంకంపల్లి, వెంకటగిరి, కౌకుంట్ల, ఇస్రంపల్లి, అడ్డాకుల మండలం రాచాలకు చేరుకుంది. ఈ సందర్భంగా రాచాల గ్రామస్తులతో  నిర్వహించిన ‘మాట-ముచ్చట’ కార్యక్రమంలో  షర్మిల మాట్లాడారు. వలసల జిల్లాగా ఉన్న పాలమూరుకు వైఎస్సార్​ హయాంలోనే ప్రాజెక్టులు వచ్చాయని, కేసీఆర్​ను రెండుసార్లు  సీఎం చేసినా ఆ  జిల్లాకు చేసిందేమీ లేదని ఫైరయ్యారు. ‘‘కేసీఆర్​వన్నీ మోసపూరిత హామీలే.

రైతుబంధు కింద ఎకరాకు రూ.5 వేలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, సబ్సిడీలు బంద్​ పెట్టిండు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్.. 17 వేల పోస్టులే  భర్తీ చేసి నిరుద్యోగులను మోసం చేసిండు. బంగారు తెలంగాణను చేస్తానని నమ్మించి, అప్పుల తెలంగాణగా మార్చిండు. ఈ దరిద్రం ఇక్కడితో చాలదన్నట్లు ఢిల్లీకి పోతానని ప్రకటనలు చేస్తున్నడు. బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక దేశం మీద పడదామనుకుంటున్నడు. ప్రజలు కేసీఆర్​ మాటల్ని నమ్మే స్థితిలో లేరు” అని షర్మిల అన్నారు. కాగా రాచాలలో ‘మాట-ముచ్చట’ అనంతరం యాత్ర అడ్డాకుల మండల కేంద్రానికి చేరింది. అక్కడి నుంచే మంగళవారం ఉదయం యాత్ర  కొనసాగనుంది.