లాల్ దర్వాజాలో బోనమెత్తిన షర్మిల

లాల్ దర్వాజాలో బోనమెత్తిన షర్మిల

హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బోనమెత్తారు. నగరంలో అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది. ఆదివారం లాల్ దర్వాజలో జరుగుతున్న బోనాల పండగకు షర్మిల హాజరయ్యారు. ఆలయానికి వచ్చిన ఆమె అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి బంగారు బోనమెత్తారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండగ బోనాలు అని అన్నారు.  రాష్ట్రం  అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరినట్లు షర్మిల తెలిపారు. 

ఇక... ఆదివారం బోనాలు కావడంతో నగరంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. చరిత్రాత్మక హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభమయ్యాయి. గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారికి మూడు వారాలుగా బోనాల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.  ఆషాఢ మాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజాతో పాటు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి, చార్మినార్‌ భాగ్యలక్ష్మీ, గౌలిపురా కోటమైసమ్మ, ఆలియాబాద్‌ దర్బార్‌ మైసమ్మ దూద్‌బౌలి పయనీర్‌ ముత్యాలమ్మ, మీర్‌ ఆలం మండి మహంకాళేశ్వర మందిరంలో వేలాది మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.