అపోలో హాస్పిటల్ నుంచి వైఎస్ షర్మిల డిశ్చార్జ్

అపోలో హాస్పిటల్ నుంచి వైఎస్ షర్మిల డిశ్చార్జ్

హైదరాబాద్ : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆమె లోటస్ పాండ్ కు వెళ్లారు. వైద్యుల సూచనల మేరకు షర్మిల విశ్రాంతి తీసుకుంటున్నారు. 

తాము తలపెట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షర్మిల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్షను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు తరలించారు. షర్మిలను ఆమె తల్లి విజయమ్మ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. లో బీపీ, బలహీనత, మత్తు ఉండటంతో అడ్మిట్ అయ్యారని, డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని డాక్డర్లు తెలిపారు. రెండు మూడు వారాలు షర్మిలకు విశ్రాంతి అవసరమని చెప్పారు.

నన్ను బంధించడం కేసీఆర్ తరం కాదు : షర్మిల

ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని షర్మిల అన్నారు. వైఎస్సార్​ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ టీపీని ఏర్పాటు చేశామని చెప్పారు. పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా పోలీసుల భుజాన గన్ పెట్టి పాదయా త్రను టార్గెట్ చేసి, పర్మిషన్ ఇవ్వకుండా చేశారని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలంటే కేసీఆర్ కు గౌరవం లేదన్నారు. తనను బంధించడం కేసీఆర్​ తరం కాదని హెచ్చరించారు.