యూసుఫ్ ఔట్.. అభిషేక్ బెనర్జీ ఇన్.. అఖిలపక్ష బృందంలో మారిన టీఎంసీ ప్రతినిధి

యూసుఫ్ ఔట్.. అభిషేక్ బెనర్జీ ఇన్.. అఖిలపక్ష బృందంలో మారిన టీఎంసీ ప్రతినిధి

న్యూఢిల్లీ: భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో తృణమూల్ కాంగ్రెస్ ​నుంచి ఆ పార్టీ ఎంపీ, బెంగాల్ ​సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భాగం కానున్నారు. ముందుగా ఈ బృందంలో తృణమూల్ కాంగ్రెస్​ నుంచి ఆ పార్టీ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పేరును కేంద్రం చేర్చింది.

అయితే, తమ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం యూసుఫ్ పఠాన్ పేరును చేర్చడంపై తృణమూల్​ కాంగ్రెస్​నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రతినిధి బృందానికి ఎవరిని కేటాయించాలో పార్టీ మాత్రమే నిర్ణయిస్తుందని నొక్కి చెప్పారు.

ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బెంగాల్​సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేసి.. తృణమూల్ నుంచి ప్రతినిధి సూచించాలని కోరగా.. ఆమె తన మేనల్లుడి పేరును సిఫార్సు చేశారు. అలాగే, ప్రతినిధిని నిర్ణయించే ముందు తమతో సంప్రదించి ఉండాలని ఆమె రిజిజుతో చెప్పారని పార్టీ నేతలు తెలిపారు. జేడీయూకు చెందిన సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో అభిషేక్ బెనర్జీ నియమితులయ్యే అవకాశం ఉంది.