బ్రాడ్ నువ్వో లెజెండ్‌‌: యువరాజ్ సింగ్

బ్రాడ్ నువ్వో లెజెండ్‌‌: యువరాజ్ సింగ్

న్యూఢిల్లీ: స్టువర్ట్‌ బ్రాడ్ పేరు క్రికెట్ ఫ్యాన్స్‌కు సుపరిచితమే. టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టుకు అండర్సన్‌తో కలసి బ్రాడ్‌ చిరస్మరణీయ విజయాలు అందించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లిష్‌ టీమ్‌కు మెయిన్ బౌలర్ అయ్యాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో కూడా మెరుగ్గా రాణించిన ఈ బౌలర్‌‌.. 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అయితే కెరీర్‌‌ ఆరంభంలో బ్రాడ్ కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించాలి. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బ్రాడ్‌ బౌలింగ్‌లోనే పంజాబీ పుత్తర్ యువరాజ్ సింగ్ 6 బాల్స్‌కు ఆరు సిక్సర్‌‌లతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ తర్వాత తప్పులు తెలుసుకున్న బ్రాడ్ తన ఆటను మెరుగుపర్చుకుంటూ, బౌలింగ్‌కు పదును పెట్టాడు. తద్వారా ఇంగ్లండ్ క్రికెట్‌లో తన మార్క్‌ను క్రియేట్ చేశాడు. తాజాగా బ్రాడ్ గురించి యువరాజ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. బ్రాడ్ బౌలింగ్‌ను యువీ ప్రశంసించాడు.

‘నేను బ్రాడ్ గురించి ఏమైనా చెప్పినా ప్రజలు 6 సిక్సుల మ్యాచ్‌ను గుర్తు చేస్తారు. ఈరోజు నేను ఫ్యాన్స్‌కు ఓ విషయం విజ్ఞప్తి చేస్తున్నా. టెస్టుల్లో బ్రాడ్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇది జోక్ కాదు. పట్టుదల, కఠోరశ్రమ, అంకితభావానికి ఇది నిదర్శనం. బ్రాడ్ నువ్వో లెజెండ్. నీకు హ్యాట్సాఫ్‌’ అని యువరాజ్ ట్వీట్ చేశాడు.వెస్టిండీస్‌తో జరిగిన చివరి టెస్టులో క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను ఔట్ చేయడం ద్వారా 500 క్లబ్‌లో బ్రాడ్ చోటు సంపాదించాడు. తద్వారా టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన 7వ బౌలర్‌‌గా నిలిచాడు. బ్రాడ్ పార్ట్‌నర్ అండర్సన్ కూడా 500 వికెట్స్‌ క్లబ్‌లో ప్లేస్ సంపాదించిన సంగతి తెలిసిందే.