Yuzvendra Chahal: అదొక హార్ట్ బ్రేక్.. ఆ రోజు కోహ్లీ బాత్రూంలో ఏడవడం చూశాను: చాహల్

Yuzvendra Chahal: అదొక హార్ట్ బ్రేక్.. ఆ రోజు కోహ్లీ బాత్రూంలో ఏడవడం చూశాను: చాహల్

సరిగ్గా ఆరేళ్ళ క్రితం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత బాధను మిగిల్చింది. 7 మ్యాచుల్లో విజయం సాధించి టేబుల్ టాపర్ గా వెళ్లిన మన టీంకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కు వెళ్లిన ఈ మ్యాచ్ లో ధోనీ, జడేజాల పోరాటంతో భారత్ గెలుస్తుందని ఆశించినా చివర్లో మాహీ రనౌట్ తో కివీస్ మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ బాత్రూమ్ లో ఏడవడం తాను చూశానని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో టీమిండియా స్పిన్నర్ చాహల్ చెప్పుకొచ్చాడు. 

ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన చాహల్ 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఓటమి తర్వాత జట్టు ఎంతగా కుప్పకూలిపోయిందో గుర్తుచేసుకున్నాడు. "విరాట్ భయ్యా బాత్రూంలో ఏడుస్తున్నట్లు నేను చూశాను. ఆ రోజు నేను చివరి బ్యాటర్‌గా బరిలోకి దిగినప్పుడు, అతని కళ్ళలో నీళ్ళు తిరగడం చూశాను. కోహ్లీని కాదు చాలా మంది మ్యాచ్ ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మహి భాయ్ చివరి మ్యాచ్. నా బౌలింగ్ పట్ల ఆ రోజు చింతిస్తున్నాను". అని చాహల్ అన్నాడు. ఈ మ్యాచ్ లో చాహల్ 10 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చి కేన్ విలియమ్సన్ వికెట్ తీసుకున్నాడు.

►ALSO READ | Jasprit Bumrah: టీమిండియా స్క్వాడ్ నుంచి బుమ్రా రిలీజ్.. మళ్ళీ జట్టులో కనిపించేది అప్పుడే!

ఈ మ్యాచ్ అనంతరం క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు టీమిండియా ఆటగాళ్లు బాగా బాధపడ్డారు. రోహిత్ శర్మ అయితే ఏడ్చేశాడు. ఇదిలా ఉండగా ఎప్పుడు భావోద్వేగాలను అదుపులో పెట్టుకునే ధోనీ సైతం ఔటైన తర్వాత బాగా ఎమోషనల్ అవ్వడం సగటు క్రికెట్ అభిమానిని కలిచి వేసింది. అయితే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ధోనీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీస్‌ చేరిన టీమిండియా.. ఈ మ్యాచు ఓటమితో మరోసారి ఐసీసీ టోర్నీ అందుకోకుండానే పోరాటం ముగించింది. ఈ  సెమీ ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో గెలిచింది. 

వర్షం అంతరాయం కలిగించిన ఈ సెమీ ఫైనల్లో మ్యాచ్ రెండు రోజులు జరిగింది. మొదట న్యూజిలాండ్ ను 239 పరుగులకే కట్టడి చేసిన భారత్.. బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ చేజార్చుకుంది. స్వింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై ట్రెంట్‌ బౌల్ట్‌ నేతృత్వంలోనే కివీస్‌ పేస్‌ దళం చెలరేగిపోయింది. దీంతో జట్టు స్కోరు 5 పరుగులకే భారత్‌ కేఎల్ రాహుల్(1), రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లీ(1)ల వికెట్లను కోల్పోయింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో జడేజా 77 పరుగులతో వీరోచిత పోరాటం చేసినా కీలక సమయంలో జడేజాతో పాటు ధోనీ రనౌట్ కావడం భారత్ కు పరాజయం తప్పలేదు. 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది.