జహీరాబాద్ లో ఎలక్షన్ సందడి..పదేళ్ల తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు

జహీరాబాద్ లో ఎలక్షన్  సందడి..పదేళ్ల తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు

 

  • ఆరేళ్లుగా పాలకవర్గానికి దూరం
  • గ్రామాల విలీన సమస్యతో స్పెషల్ ఆఫీసర్ పాలన  
  • కోర్టు కేసు కొట్టేయడంతో ఎన్నికలకు  సిద్ధమవుతున్న అధికారులు

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్​మున్సిపాలిటీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదేళ్ల పాటు పాలకవర్గాన్ని కొనసాగించగా మరో ఐదున్నర ఏళ్లుగా స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతోంది.  పదిన్నర ఏళ్ల తర్వాత ఎన్నికలు రావడంతో జహీరాబాద్ మునిసిపాలిటీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 

జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు, 263 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఈసారి జహీరాబాద్ మున్సిపాలిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారులు ఓటర్ల ముసాయిదా విడుదల చేయగా ఈ నెలలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. దీంతో జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం స్థానిక లీడర్లు, ఆశావాహులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

2014 జులైలో జహీరాబాద్ పాలకవర్గానికి చివరగా ఎన్నికలు జరుగగా, బీఆర్ఎస్  ఒప్పందం ప్రకారం లావణ్య చందు రెండున్నర సంవత్సరాలు, మరో రెండున్నర ఏళ్లు షబానా తంజీం చైర్మన్ గా కొనసాగారు. ఆ ఇద్దరు చైర్మన్ హోదాలో 2019 వరకు పాలకవర్గాన్ని నడిపించారు.

 ఆ తర్వాత మున్సిపాలిటీలో గ్రామాల విలీన సమస్యపై కోర్టు పరిధిలో కేసు ఉండడంతో ఇప్పటివరకు అక్కడ స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతూ వచ్చింది. ఆ ఇష్యుపై కోర్టులో కేసు కొట్టివేయడంతో ఇప్పుడు జహీరాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఐదు గ్రామాల విలీనంతో..

జహీరాబాద్ మున్సిపాలిటీలో సమీప 5 గ్రామాలను విలీనం చేస్తూ 2018లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోతి(కే), పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, చిన్న హైదరాబాద్ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ 24 వార్డులున్న జహీరాబాద్ మున్సిపాలిటీని 37 వార్డులకు పెంచింది. 2019 జులైలో తుది జాబితా ప్రకటించినప్పటికీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హోతి(కె) గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. 

దీంతో 2019 లో ఇతర మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి జహీరాబాద్ బల్దియాకు మాత్రం ఎన్నికలు నిర్వహించకుండా నిలిపివేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు అక్కడ స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతూ వచ్చింది. 2022లో హోతి(కే) వాసుల కేసును కోర్టు కొట్టివేసి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఈ క్రమంలో ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్ పాలకవర్గానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఎన్నికల కమిషన్ పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో వేట మొదలుపెట్టగా ఆశవాహుల్లో జోష్ పెరిగింది.