సంక్షోభంలో జీరో ఫుడ్‌‌‌‌ చిన్నారులు!

సంక్షోభంలో జీరో ఫుడ్‌‌‌‌ చిన్నారులు!

భారతదేశంలో 6.7 మిలియన్ల చిన్నారులు కడు పేదరికంతో పాటు పలు ఇతర కారణాలతో  ఏమీ తినకుండా ఆకలితోనే నిద్రిస్తున్నారనే వార్త మనల్ని కలచివేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో 6 నుంచి 23 నెలల వయస్సుగల పిల్లలు కడు పేదరికంతో ఆకలితో  రోజుల తరబడి గడుపుతున్నారు. ఇలాంటి అభాగ్య పిల్లల్ని “జీరో ఫుడ్‌‌‌‌ చిన్నారులు” అని పిలుస్తున్నారు. కేవలం తల్లి పాలతో మాత్రమే పిల్లల ఎదుగుదల పరిపూర్ణంగా జరగదు. 6 నెలలు దాటిన పిల్లలకు సులభంగా జీర్ణం కాగలిగిన తేలికైన పలు ఇతర పోషకాహారాన్ని తప్పక అందించాలి.

పేదరికంతో పాటు తల్లితండ్రుల శ్రద్ధ, అవగాహన లేకపోవటంతో చిన్నారులు కాలే కడుపులతో  రోజులు గడుపుతున్నట్లు స్పష్టం అవుతున్నది.  ఇటీవల హార్వర్డ్‌‌‌‌ అధ్యయనం ప్రకారం పేదరికం, పట్టణీకరణ, సామాజిక,- ఆర్థిక, పర్యావరణ సమస్యలతో చిన్నారులు ‘జీరో ఫుడ్‌‌‌‌’ రాత్రులు గడుపుతున్నట్లు వెల్లడించారు.  పోషకాహార లోపం, సూక్ష్మ పోషకాల లోపాలతో బాలలు దయనీయంగా గడపడం మనందరికి అవమానకరం. 6 నుంచి 23 నెలల వయస్సు కలిగిన చిన్నారులు తల్లి పాలతో పాటు పలు రకాల పోషకాహార పదార్థాలను పెరిగే పిల్లలకు విధిగా అందించాలి. ఈ బాల్య దశలో తల్లి పాలతో పాటు ఇతర ఆహారాలను అందించని కారణంగా పెరుగుదల మందగించి శక్తిహీనులుగా అకాల మరణాల అంచున నిలబడుతున్నారు.

భారత్​లో 19.3 శాతం జీరో ఫుడ్‌‌‌‌ చిన్నారులు

 భారత్‌‌‌‌లో  జీరో ఫుడ్‌‌‌‌ బాలలు 19.3 శాతం ఉన్నారు. అత్యధిక శాతం జీరో ఫుడ్‌‌‌‌ చిన్నారులు గ్వానాలో 21.8 శాతం ఉన్నట్లు తెలుస్తున్నది.  దక్షిణ ఆసియాలో 15.7 శాతం, ఆఫ్రికా దేశాల్లో 10.5 శాతం జీరో ఫుడ్‌‌‌‌ పిల్లలు ఉన్నట్లు తేలింది. లాటిన్‌‌‌‌ అమెరికా ప్రాంత దేశాల్లో అతి తక్కువగా 1.9 శాతం, 2.9 శాతం జీరో ఫుడ్‌‌‌‌ బాలలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల “జామా నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఓపెన్” నిర్వహించిన‌‌‌‌ అధ్యయనం ఆధారంగా భారత్‌‌‌‌లోని యూపీలో 28.4 శాతం, బిహార్‌‌‌‌లో 14.2 శాతం, మహారాష్ట్రలో 7.1 శాతం, రాజస్తాన్‌‌‌‌లో 6.5 శాతం, ఎంపీలో 6 శాతం చిన్నారులు 24 గంటల్లో తల్లిపాలు తప్ప ఏమీ తినకుండానే నిద్రిస్తున్నట్లు వెల్లడి అవుతున్నది. కాగా, తల్లి పాలకు అదనంగా పిల్లలకు ఇతర ఆహార పదార్థాలతో  50 శాతం పోషకాలు అందించాల్సి ఉంటుంది. వివిధ అధ్యయనాల ప్రకారం దేశంలో జీరో ఫుడ్‌‌‌‌ చిన్నారులు 2016లో 17.2 శాతం ఉండగా, 2021లో 17.8 శాతం వరకు పెరిగినట్లు వెల్లడైంది. 

2021 వివరాల ప్రకారం...

ఇండియాలో 2021 వివరాల ప్రకారం  59 లక్షల బాలలు జీరో ఫుడ్ ‌‌‌‌దుస్థితిలో ఉండగా అందులో యూపీలో 27.4 శాతం, చత్తీస్‌‌‌‌గఢ్​లో 24.6 శాతం, జార్ఖండ్‌‌‌‌లో 21 శాతం, రాజస్తాన్‌‌‌‌లో 19.8 శాతం, అస్సాంలో 19.4 శాతం ఉన్నట్లు తెలుస్తున్నది. రెండు ఏండ్లలోపు అమాయక చిన్నారులు 24 గంటల్లో తల్లి పాలు మాత్రమే తాగుతూ పోషకాహారాలను తీసుకోవడం లేదు. డిజిటల్‌‌‌‌ యుగంలో కూడా ఇలాంటి దుస్థితి రాజ్యమేలడం దురదృష్టకరం, ఆక్షేపణీయం.  పోషకాహార లోపం కారణంగా చిన్నారులు అకాల మరణం చెందడం లేదా వ్యాధులతో శక్తిహీనంగా మారుతున్నారు.  పౌర సమాజం, ప్రభుత్వాలు చిన్నారులకు పోషకాహారాన్ని నిత్యం అందించే ప్రయత్నాలు చేస్తూ, ఆరోగ్యవంతులైన పౌరులుగా ఎదగడానికి సహకరించాలి.

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, ఎనలిస్ట్​