కీవ్: క్రెమెన్‌చుక్‌లోని అమ్‌స్టర్ మాల్‌పై మిసైల్ దాడులను ఖండించిన ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ.. రష్యా మిలటరీని టెర్రరిస్టులతో పోల్చారు. పుతిన్ ఆర్మీ పిచ్చి పట్టిన టెర్రరిస్టులు అని, వారికి భూమిపై ఉండే హక్కు లేదని మండిపడ్డారు. మాల్‌పై మిసైల్ దాడిలో 18 మంది పౌరులు చనిపోయారన్నారు. 60 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. పక్కా ప్లాన్‌తోనే రష్యా ఈ దాడి చేసిందని ఆరోపించారు. శాంతియుతంగా ఉన్న నగరంలోని ఓ ఆర్డినరీ మాల్‌పై మిసైల్ ఎటాక్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి సమయంలో మాల్లో మహిళలు, చిన్నారులు, పౌరులు ఉన్నారని తెలిపారు. మాల్‌పై అసలు దాడే చేయలేదని రష్యా ప్రకటించిందని, తరువాత తప్పు తెలుసుకుని మాట మార్చిందన్నారు. మాల్‌కు సమీపంలోని యూఎస్ మిలటరీ బేస్‌ను టార్గెట్ చేసుకోగా.. గురి తప్పి మాల్‌పై పడిందని యూఎస్ చెప్పిందని జెలెన్స్కీ వివరించారు. అయితే క్రెమెన్‌చుక్‌లో అస్సలు మిలిటరీ క్యాంపులే లేవని, రష్యా కావాలనే మాల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని విమర్శించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, చాలా మంది ఆచూకీ లభించడం లేదన్నారు. సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రజలు ప్రయత్నాలు చేస్తుంటే.. రష్యా మిసైల్స్‌తో దాడులు చేస్తోందన్నారు. తమ నుంచి రష్యా సైనికులకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించినా పుతిన్ వినిపించుకోవడం లేదని తెలిపారు. యూరోపియన్ చరిత్రలో రష్యా ఉగ్రవాదులు చేసిన అతిపెద్ద దాడిగా విమర్శించారు. ఏడాదిలోపు రష్యాతో యుద్ధం ముగిసేలా చూడాలని జీ-7 దేశాల అధినేతలను జెలెన్ స్కీ కోరారు. మాల్‌పై రష్యా దాడిని జీ–7 దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు.
