తొలి టెస్టులో తడబడ్డ జింబాబ్వే.. పసికూన నడ్డి విరిచిన న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ

తొలి టెస్టులో తడబడ్డ జింబాబ్వే.. పసికూన నడ్డి విరిచిన న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ

బులవాయో (జింబాబ్వే): న్యూజిలాండ్‌‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌‌లో జింబాబ్వే బ్యాటర్లు తబడడ్డారు. పేసర్‌‌ మ్యాట్‌‌ హెన్రీ (6/39), నేథన్‌‌ స్మిత్‌‌ (3/20) చెలరేగడంతో.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌‌లో 60.3 ఓవర్లలో 149 రన్స్‌‌కే ఆలౌటైంది. కెప్టెన్‌‌ క్రెయిన్‌‌ ఎర్విన్‌‌ (39) టాప్‌‌ స్కోరర్‌‌. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఆతిథ్య జట్టును కివీస్‌‌ బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా హెన్రీ బాల్‌‌ను ఇరువైపుల స్వింగ్‌‌ చేస్తూ లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌ రాబట్టాడు. 

మూడో ఓవర్‌‌లో బెన్నెట్‌‌ (6)తో మొదలైన వికెట్ల పతనానికి ఎక్కడా అడ్డుకట్ట పడలేదు. టఫాజ్వా సిగా (30), నిక్‌‌ వెల్చ్‌‌ (27), బెన్‌‌ కరన్‌‌ (13)తో సహా మిగతా వారందరూ ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌‌లో ఏడుగురు సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌ ఆట ముగిసే టైమ్‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌లో 26 ఓవర్లలో 92/0 స్కోరు చేసింది. ఓపెనర్లు విల్‌‌ యంగ్‌‌ (41 బ్యాటింగ్‌‌), డెవాన్‌‌ కాన్వే (51 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.