న్యూయార్క్ కాంతిరేఖ -భారతీయ జొహ్రాన్

న్యూయార్క్ కాంతిరేఖ -భారతీయ జొహ్రాన్

జోహ్రాన్ మందానీ భారతీయ సంతతికి చెందిన 34 ఏండ్ల యువకుడు.  ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్ 111వ  మేయర్ గా ఎన్నికై  ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోని వ్యక్తిగా నిలిచాడు.  సామ్రాజ్యవాదం, విస్తరణవాదం,  ఆర్థిక సాంకేతిక ఏకస్వామ్యంతో  ప్రపంచ పోలీసుగా పెత్తనం చలాయిస్తున్న అమెరికాలో వాటికి విరుద్ధమైన రాజకీయాలను ప్రచారంచేసి  మేయర్  ఎన్నికలలో  గెలిచి నిలిచాడు.  

రాజకీయాలలో నూతన శకం ఆరంభానికి ఒక సంకేతంగా నిలిచాడు.  యాంకీలు అని పిలుచుకునే న్యూయార్క్ వాసుల హృదయంతోపాటు  ప్రపంచవ్యాప్తంగా సోషలిస్ట్ భావాలకు, శిబిరాలకు కొత్త ఉత్తేజాన్ని నింపాడు.  నూతన ఆశా కాంతిరేఖగా,    జెన్ జడ్​తరానికి ఒక నిర్మాణాత్మక  ప్రతినిధిగా,  మోడల్​గా నిలిచాడు.   జోహ్రాన్ తల్లి  గుజరాత్​కు  చెందిన మీరానాయర్,  జీవన వాస్తవికతను,  బహుళ సంస్కృతిని,  సంపద సృష్టికర్తల  శ్రామిక జనజీవనం, మహిళల ఆత్మగౌరవం, స్వయం స్వావలంబన ఆకాంక్ష,   చరిత్ర నిర్మాణ సారథులు అనే తాత్వికతతో  ‘సలాం బాంబే,  మాన్ సూన్ వెడ్డింగ్స్’ వంటి పలు సమాంతర సినిమాలు నిర్మించారు.  తండ్రి బాంబేలో పుట్టిన  ప్రొఫెసర్ మందానీ సామాజిక, మానవ శాస్త్రవేత్త.  పెట్టుబడి వ్యవస్థ  బాధితులనే నేరస్తులుగా చూపిస్తున్న తీరును,  ఆయుధ వ్యాపారం కోసం,  ఆర్థిక వనరుల కోసం యుద్ధాలు,  జినోసైడ్స్​కు  పాల్పడుతున్న వైనాన్ని గురించి  పలు పుస్తకాలను రాశాడు. 

న్యూయార్క్​ వేదికగా సామాజిక రాజకీయ కార్యాచరణ

ఈ జనహిత మేధో శ్రామికుల జంటకు జన్మించిన జోహ్రాన్ వారి  తాత్వికత  కొనసాగింపుగా తన సామాజిక రాజకీయ కార్యాచరణ కోసం న్యూయార్క్​ను వేదికగా ఎంచుకున్నాడు. 2021లో న్యూయార్క్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా తన  ప్రస్థానం  ప్రారంభించారు.  తన రాజకీయ భావనలకు తగిన బెర్నీ సాండర్స్ నాయకత్వంలోని  డెమోక్రాటిక్  సోషలిస్ట్ ఆఫ్ అమెరికా సంస్థలో చురుకైన కార్యకర్తగా ఉన్నాడు.  ఈ సంస్థ లాభాల కోసం నడిచే ఆర్థికవ్యవస్థ స్థానంలో ఆరోగ్యం,  విద్య ,  నివాసం ప్రజలందరికీ అందుబాటులో ఆర్థిక విధానాలు అమలుచేయాలని న్యూయార్క్ కేంద్రంగా కృషి  చేస్తున్నది.   

కార్పొరేట్లు రాజకీయ విధానాలలో జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తోంది.  2025 న్యూయార్క్  మేయర్ ఎన్నికలకు 2024 అక్టోబర్ నుంచి  ప్రచారం  ప్రారంభమయ్యింది.  సర్వేలో ఒక శాతం మద్దతు పొందిన జోహ్రాన్..  ఎన్నికైన నాటికి 50.5 శాతం మద్దతును పొంది ఎన్నికలలో విజయం పొందాడు.   ఒక సామాజిక శాస్త్రవేత్తగా న్యూయార్క్ చరిత్రను,  జన జీవితాన్నివిస్తృతంగా అధ్యయనం చేశాడు.   ప్రపంచవ్యాప్తంగా అధిక లాభాలతో అమెరికా బహుళజాతి కంపెనీల సంపద  న్యూయార్క్​లో స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్​లో నమోదు అవుతుంటుంది.  అత్యధిక బిలియనీర్స్ ఉండే  ఈ  నగరంలోనే 17  సెప్టెంబర్ 2011లో  ‘ఆక్యూపై  వాల్​స్ట్రీట్’ ఉద్యమం ఉవ్వెత్తున  లేచింది.   మేం  99% మీరు 1%  అనే నినాదంతో ఆదాయ అసమానతలను, సంపద  మొత్తం ఒకశాతం ఉన్నవారి దగ్గర కేంద్రీకృతం అవడాన్ని  ప్రశ్నించారు.

ట్యాక్స్  ద  రిచ్ నినాదం

జోహ్రాన్ ఈ సామాజిక ఉద్యమ తాత్వికతను మరింతగా న్యూయార్క్ వాసులకు చేరవేశాడు.   
ప్రధానంగా కార్మిక సంఘాలను,  వీధి వ్యాపారులను, తక్కువ ఆదాయం కలవారిని,  న్యూయార్క్  నగర  సౌధ  నిర్మాణానికి తమ రక్తం,  చెమట ధారపోసిన ఆసియా,  లాటిన్ అమెరికా,  ఆఫ్రికాలకు చెందిన ప్రజలను కలసి తన అభివృద్ధి సంక్షేమ ప్రణాళికను అర్థం చేయించాడు.  వలసదారులపై,    భాష,  మత  మైనారిటీలపై  వివక్షతను,   ఫోబియాను ఉద్దేశపూర్వకంగా  సృష్టిస్తున్న అతి జాతీయవాద,  ఫాసిస్ట్ పోకడలను నిలువరించక పోతే మన మనుగడ ప్రమాదంలో పడిపోతుందని తెలియచేశాడు.  సగటు అమెరికన్​కు తన నిత్య జీవితంలో  లౌకిక  నైతికతను,  బహుళత్వ సంస్కృతిని ఆచరించే గుణం ఉంది.   ఈ విలువలను విధ్వంసం చేసే కుట్రలను ప్రోత్సహిస్తున్న శక్తులను నిర్వీర్యం చేయాలని పిలుపునిచ్చాడు.   న్యూయార్క్ నగరాన్ని అత్యంత వ్యయభరితంగా మార్చి ఆ నగర 
నిర్మాణానికి రాళ్లెత్తిన  సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండకుండా చేస్తున్న ధనవంతుల కుట్రలను బహిర్గతం చేశాడు.    జీవన వ్యయం తగ్గింపు,   నవజాత శిశువు నుంచి  5 సంవత్సరాల వయసు వరకు పిల్లల సంరక్షణ,  గృహ కిరాయిలను పెంచకుండా ఉంచడం,  వేగం, ఉచితం అయిన బస్ ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తానని,  అవినీతి సంస్కృతిని తగ్గిస్తానని  హామీ ఇచ్చాడు.   వీటికి నిధుల సేకరణ కోసం న్యూయార్క్ బిలియనీర్లపై  కేవలం 2% పన్నును పెంచినట్లయితే  తను  ప్రతిపాదించిన సంక్షేమ విధానాలు అమలు అవుతాయని తెలియచేశాడు.   ట్యాక్స్ ద  రిచ్  నినాదాన్ని సామాన్య ప్రజలను విశేషంగా ఆకర్షించింది.

శాంతియుత సమాజానికి ఆశాకిరణం

వాల్ స్ట్రీట్ జర్నల్,  న్యూయార్క్ పోస్ట్ వంటి పలు పత్రికలు జోహ్రాన్ వ్యతిరేక కథనాలు ప్రచురించాయి.  టాక్స్ ద రిచ్,   శ్రామిక,  మధ్య తరగతి  ప్రజల అశాంతిని,  ఆక్రోశాన్ని,  ధిక్కారాన్ని  వ్యక్తంచేసే మార్చింగ్ విప్లవ నినాదంగా మారి,  బిలియనీర్లను  నిరాయుధులను చేసి,  వారి అపరిమిత లాభాల దురాశకు  కళ్లెం వేసింది.   ఫలితంగా జోహ్రాన్ మందానీ అత్యధిక ప్రభావ సామ్యవాదిగా అమెరికా చరిత్రలో నిలిచి గెలిచాడు.   సమకాలీన  సంక్షోభ  ప్రపంచ రాజకీయ చరిత్రను మలుపు తిప్పాడు.  శాంతియుత సమాజ స్థాపనకు పని చేస్తున్న శక్తులకు ఒక ఆశాకిరణంగా, ఉత్తేజంగా మారాడు.  6 నవంబర్ విజయోత్సవ ప్రసంగంలో ప్రజాస్వామ్య సోషలిజం తాత్వికతతో నవ భారతాన్ని ఆవిష్కరించిన నెహ్రూ కొటేషన్​ను   ప్రస్తావించాడు.  ‘ఒక శకం అంతానికి అంచున కొత్త చరిత్ర కాలపు గుమ్మం ముందు మనం నిలబడి ఉన్నాం’,  మానవుడు అంతులేని సాహసకృత్యానికి నాంది పలికాడు.  

ఇక్కడి మనుషులు నిరంతరం అసమానతలకు వ్యతిరేకంగా పోరు సలిపారు.  మనం ఇప్పుడు నూతన శకంలోకి అడుగుపెట్టాం.  యూదు న్యూయార్కర్​లతోపాటు అన్ని రకాల  వలసవాదుల  శక్తితో  మన నగరాన్ని నిర్మించుకుందాం.  ఈ నగరం మీదే,  దీని భవిష్యత్ మీదే   ప్రపంచ పెట్టుబడి ఆధారపడి ఉంది.  ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో  సోషలిస్ట్  మేయర్  జోహ్రాన్​ను  అస్థిరపరిచే కుట్రలకు పాల్పడే అవకాశం ఉంది.  ఇప్పటికే ట్రంప్.. ఫెడరల్ ప్రభుత్వం నుంచి సహాయాన్ని నిలిపి వేస్తాం అని హెచ్చరిక చేశాడు.  బిలియనీర్ల  సొమ్ముతో,  సంక్షేమ పథకాలతో  నగరాన్ని దివాలా తీయిస్తాడని ప్రచారం చేస్తున్నారు.  నూతన తర తాత్వికుడిగా,  యుద్ధం,  వివక్ష లేని శాంతియుత సమాజ స్వాప్నికుడిగా మన ముందు నిలిచిన జోహ్రాన్ మందానికి మద్దతుగా నిలుద్దాం.  అతని స్ఫూర్తితో  అంతరాలు లేని సమాజ స్థాపనకు మరో ముందడుగు వేద్దాం. 

జెన్ జడ్​పై ప్రభావం

తన వాక్ పటిమ,  మేధో శ్రామికత్వం,  వివక్షకు లోనవుతున్న ప్రజల ఆహార, అలంకరణ,  సంస్కృతి,  సాహిత్య వాతావరణాన్ని అవగాహన  చేసుకుని ప్రచారంలో అనూహ్యంగా ముందుకువెళ్ళాడు జోహ్రాన్​.  ప్రధానంగా జెన్ జడ్​.. 18 నుంచి  29 వయసుగల  యువతను  ముందు మేల్కొలిపి ఆలోచనలో  పడేశాడు.  తన ప్రధాన పోటీదారుగా నిలిచిన డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉన్న అండ్రూ క్యుమోకు ప్రచారంలో బిలియనీర్స్ అండగా నిలిచారు.  జోహ్రాన్​ను ఓడించడానికి 3 ట్రిలియన్ల  డబ్బును  కుమ్మరించారు.   సోషలిస్ట్,  లౌకిక భావాలున్న జోహ్రాన్  గెలిస్తే  తమ  లాభాల  దురాశకు  అడ్డంకులు  ఏర్పడతాయని వారు భావించారు.  డబ్బులతోపాటు  జోహ్రాన్​పై  కట్టు కథనాలతో విష ప్రచారం  చేశారు.  న్యూయార్క్​లో  గణనీయమైన సంఖ్యలో ఉన్న బిలియనీర్లు  పది లక్షల  యూదులను  జోహ్రాన్ పైకి ఉసిగొల్పారు.  యూదులను ద్వేషించే,   ఇజ్రాయెల్​ను  గుర్తించని వ్యక్తిగా  ప్రచారం చేశారు. 9/01 వాణిజ్య కేంద్రాలపై దాడులు చేసిన సంస్థలతో అంటకాగుతున్నారని,   కమ్యూనిస్ట్  క్యూబాతో  రహస్య  ఒప్పందాలను చేసుకున్నాడని,  అతనికి అనుభవం లేదని,  ప్రపంచ ఆర్థిక రాజధాని న్యూయార్క్​లో  ఒక కమ్యూనిస్ట్​ను గెలిపిస్తే అమెరికాకు అవమానమని  ప్రచారం చేశారు.   కాలం చెల్లిన సామ్యవాద విధానాలు న్యూయార్క్  ప్రతిష్టను  దెబ్బ తీస్తాయని చెపుతూ  జోహ్రాన్​ను  ఓడించాలని  పిలుపునిచ్చారు.  ఎన్నికల రోజున బిలియనీర్లు  తమ సంస్థల ఉద్యోగులందరినీ  జోహ్రాన్​కు వ్యతిరేకంగా  ఓటు వేయాలని సెలవులను ప్రకటించారు.  


అస్నాల శ్రీనివాస్,
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం