స్ట్రోక్​తో ములుగు జడ్పీ చైర్మన్​ మృతి..సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం

స్ట్రోక్​తో ములుగు జడ్పీ చైర్మన్​ మృతి..సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం

ములుగు, వెలుగు : ములుగు జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్​(47)  గుండెపోటుతో చనిపోయారు. హనుమకొండలోని స్నేహకాలనీలోని ఇంట్లో ఆదివారం ఉదయం బ్రెయిన్​స్ట్రోక్​ రాగా వెంటనే ఓ ప్రైవేట్​దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇంతకుముందు ఒకసారి ఏప్రిల్ 1న జగదీశ్​కు గుండెనొప్పి రాగా గుర్తించిన ఆయన భార్య రమ సీపీఆర్ చేసి దవాఖానకు తరలించడంతో ప్రాణాలు దక్కాయి. కానీ, ఆదివారం వచ్చిన బ్రెయిన్​ స్ట్రోక్ ​ఆయన ప్రాణాలను కబళించింది. జగదీశ్​కు భార్య, డిగ్రీ చదువుతున్న కొడుకు వెంకట సత్యదేవ్, ఇంటర్ చదువుతున్న కూతురు హరచందన ఉన్నారు. ఆయన స్వగ్రామమైన మల్లంపల్లిలో సోమవారం అంత్యక్రియలు జరుగనున్నాయి. 

మద్దికాయల ఓంకార్ తో ఉద్యమ ప్రస్థానం.. 

జగదీశ్ సొంతూరు మల్లంపల్లి. మద్దికాయల ఓంకార్ కు చెందిన ఎంపీసీపీఐలో, 1998 ప్రాంతంలో తెలంగాణ జనసభలో పనిచేశారు. కేసీఆర్​ టీఆర్ఎస్  పెట్టాక ఆయన వెంట నడిచారు. దాదాపు హైదరాబాద్​లోనే ఉన్న ఆయన కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా మెలిగారు. కేసీఆర్​ పాదయాత్రలోనూ వెంట నడిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ములుగు ప్రాంతంలో అడుగుపెట్టారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏటూరునాగారం నుంచి జడ్పీటీసీగా గెలుపొంది జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. జూన్ 7న ములుగులో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.  

సీఎం కేసీఆర్ సంతాపం

జగదీశ్​ మృతిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జగదీశ్ ​కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్ కష్ణ ఆదిత్య, ఎస్పీ గాష్ ఆలం జగదీశ్ ​మృతదేహానికి నివాళులర్పించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క జగదీశ్​ మృతిని తట్టుకోలేక కన్నీరు పెట్టారు.  

రెండు రోజుల దశాబ్ధి ఉత్సవాల వాయిదా.. 

జగదీశ్​ మృతికి సంతాప సూచకంగా ములుగు జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను రెండు రోజుల పాటు వాయిదా వేశారు. ఆదివారం జరగాల్సిన కవిసమ్మేళనం, సోమవారం పోలీసు శాఖ నిర్వహించాలనుకున్న 3కే రన్ ను వాయిదా వేశారు.