జులై 5 తర్వాతే జడ్పీ చైర్మన్ల ఎన్నిక

జులై 5 తర్వాతే జడ్పీ చైర్మన్ల ఎన్నిక

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, 77.46 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. 17న వనపర్తి జిల్లా కదిరేపాడు ఎంపీటీసీ స్థానానికి పోలింగ్‌‌ నిర్వహిస్తామన్నారు. కమిషనర్ నాగిరెడ్డి మీడియాతో బుధవారం మాట్లాడారు. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా గగ్గనపల్లిలో రూ.10 లక్షల ఇవ్వజూపిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదైందన్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారని, 8 వారాల వరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని హైకోర్టు సూచించిందన్నారు. వాట్సాప్‌‌లో బ్యాలెట్ పేపర్ల ఫొటోలు, వీడియోలు వైరల్‌‌ అవుతున్న ఘటనలపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.

27న కౌంటింగ్‌‌, అదే రోజు ఫలితాలు

రాష్ట్రంలో 123 కౌంటింగ్‌‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 27న ఉదయం కౌంటింగ్‌‌ ప్రారంభించి సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. మొత్తం 534 స్ట్రాంగ్ రూంల వద్ద రెండంచెల భద్రత ఉంటుందన్నారు. మొత్తం మూడు దశల్లో కౌంటింగ్‌‌ పూర్తి చేస్తామన్నారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు జడ్పీటీసీ ఏకగ్రీవంపై ఫిర్యాదు అందిందని,  కలెక్టర్ వద్ద పరిష్కారం అయిందన్నారు. వేసవి సెలవులు, వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ముందస్తుగా ఎన్నికల నిర్వహించినట్టు చెప్పారు.

 వేచి చూడాల్సిందే

ఫలితాలు వెలువడినా ఎంపీటీసీ, జడ్పీటీసీల ప్రమాణ స్వీకారం, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నిక జులై 5 తర్వాతే ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఎంపీపీలు, ఎంపీటీసీల పదవీకాలం జులై 3 వరకు ఉందని, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ల పదవీకాలం జులై 4 వరకు ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మంలో ఆగస్టు 5 వరకు పదవీకాలం ఉందన్నారు. అక్కడ ఆ తర్వాతే ప్రమాణ స్వీకారాలుంటాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 88 శాతం పోలింగ్ నమోదైందని, పరిషత్‌‌ ఎన్నికల్లో 77 శాతమే నమోదైనట్టు నాగిరెడ్డి చెప్పారు.

ఒకే సమయంలో డబుల్ ప్రతినిధులు

ఎన్నికైన రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వనున్నారు. అయితే ఆయా స్థానాల్లో పదవీకాలం పూర్తికానీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు ఉంటారు. దీంతో ఒకే సమయంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు అధికారికంగా పదవిలో ఉన్నట్లే లెక్క.