జునౌ: మెటా సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన సుమారు రూ.2,500 కోట్ల ఖరీదైన యాచ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలోని అలస్కా సముద్రంలో ఇంధనం అయిపోయి ఓ చిన్న బోటు చిక్కుకుంది. అందులో ఉన్నవాళ్లు సాయం కోసం పిలిచారు. ఆ సమయంలో జుకర్‌బర్గ్ బోటు దగ్గర్లోనే ఉన్నా సాయం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అలస్కాలోని పీటర్స్బర్గ్ నుంచి ఓ చిన్న బోటులో కొంతమంది జునోకు బయలుదేరారు. కుయూ దీవి దగ్గరికి చేరుకునేసరికి ఇంధనం అయిపోయి బోటు నడి సముద్రంలో ఆగిపోయింది. దీంతో వారు అమెరికా కోస్ట్‌గార్డ్ సాయం కోరగా.. చుట్టుపక్కల ఉన్న బోట్లకు రేడియో ద్వారా సందేశం పంపించారు.
ఆ టైంలో జుకర్‌బర్గ్‌కు చెందిన 387 అడుగుల భారీ బోటు ‘లాంచ్‌ప్యాడ్’ దానికి తోడుగా వెళ్లే మరో బోటు ‘వింగ్‌మ్యాన్’ అక్కడికి దగ్గర్లోనే ఉన్నాయి. అయినా అవి సాయం చేసేందుకు వెళ్లలేదని సమాచారం. చివరికి ‘వైల్డర్‌నెస్ లెగసీ’ అనే ప్రయాణికుల బోటు తన దారిని మార్చుకుని అక్కడికి వెళ్లి చిక్కుకున్న బోటులోని వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.
