ముంబైలో 11చోట్ల బాంబులు పెట్టాం.. ఆర్బీఐకి బెదిరింపులు

ముంబైలో 11చోట్ల బాంబులు పెట్టాం.. ఆర్బీఐకి బెదిరింపులు

ముంబైలోని 11 చోట్ల 11 బాంబులు అమర్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)కి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో పాటు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు భారతదేశంలో ఓ అతిపెద్ద కుంభకోణంలో ప్రమేయం కలిగి ఉన్నారని పేర్కొంటూ, వారు రాజీనామా చేయాలని మెయిల్ లో డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్‌బీఐ కార్యాలయాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో సహా 11 చోట్ల 11 బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 1:30 గంటలకు పేలుడు జరుగుతుందని దుండగులు మెయిల్‌లో పేర్కొన్నారు.

ముంబైలోని వివిధ ప్రాంతాల్లో 11 రకాల బాంబులు అమర్చామని, ప్రయివేటు రంగ బ్యాంకులతో పాటు ఆర్‌బీఐ కూడా భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డాయని గుర్తు తెలియని వ్యక్తులు ఆర్బీఐకి మెయిల్ పంపాయి. ఈ కుంభకోణంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మరి కొంతమంది అగ్ర ఆర్థిక అధికారులు, భారతదేశంలోని కొంతమంది ప్రముఖ మంత్రులు కూడా ఉన్నారన్నారు. ఇందుకు తగిన రుజువులు కూడా తమ వద్ద ఉన్నాయని మెయిల్ లో హెచ్చరించారు. ఈ మెయిల్‌లో బాంబును అమర్చిన మూడు ప్రదేశాలను కూడా ప్రస్తావించారు. అవి..

  •     RBI కొత్త సెంట్రల్ ఆఫీస్ భవనం
  •     HDFC హౌస్ చర్చిగేట్
  •     ICICI బ్యాంక్ టవర్స్ BKC

ఆర్‌బీఐ గవర్నర్‌, ఆర్థిక మంత్రి ఇద్దరూ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి, కుంభకోణాన్ని బహిర్గతం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ లో పేర్కొన్నారు. అలాగే ఈ కుంభకోణానికి పాల్పడిన వారందరికీ ప్రభుత్వం తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 1:30 లోపు మా డిమాండ్లను నెరవేర్చకపోతే, మొత్తం 11 బాంబులు ఒక్కొక్కటిగా పేలుతాయని మెయిల్‌లో బెదిరింపులు చేశారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు రంగంలోకి దిగి అన్ని ప్రాంతాల్లో సమగ్ర సోదాలు చేపట్టారు. కానీ వారికి ఎలాంటి అనుమానస్పదమైన వస్తువులు దొరకలేదు. ఆర్‌బీఐలోని హెడ్ గార్డ్ సంజయ్ హరిశ్చంద్ర పవార్ ఫిర్యాదు మేరకు ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 505 (1) (బి), 505 (2), 506 (2) కింద కేసు నమోదు చేశారు. FIR కాపీ ప్రకారం, ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్ గురించి పోలీసులకు సమాచారం అందింది. అయితే ఖిలాఫత్. ఇండియా అనే పేరుతో మెయిల్ ఐడీతో ఈ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది.